మాయమైన ఇసుకపై విచారణ చేస్తాం

విజయనగరం జూన్‌ 30 : మండలంలోని గోపాలపల్లి సమీపంలో రెవెన్యూ సిబ్బంది స్వాధీనం చేసుకున్న ఇసుక నిల్వలు మాయమవడంపై విచారణ నిర్వహిస్తామని మండల ప్రత్యేకాధికారి ఎం.అశోక్‌కుమార్‌ తెలిపారు. మండలంలోని సీతారాంపురం గ్రామంలో జరిగిన గ్రామ సందర్శనలో అక్కడి టిడిపి నాయకుడు మిడతానర త్రినాధ్‌ ఇసుక నిల్వలు ఎత్తుకు పోవడం పై ప్రత్యేక అధికారికి ఫిర్యాదు చేశారు. విఆర్‌వో నాగేశ్వరరావు మాట్లాడుతూ మామిడిపల్లి మాజీ ఎంపీటీసీ దరిమిశెట్టి సన్యాసిరావు ఈ ఇసుక నిల్వలను పోగు చేశాడని , ఈ విషయంపై తహశీల్దార్‌కు నివేదిక కూడా సమర్పించారన్నారు. ఇసుక నిల్వలు పోయిన వెంటనే ఆర్‌ఐకు ఫిర్యాదు చేశామని వీఆర్వో తెలిపారు. అనంతరం కొంత మంది గ్రామస్థులు మాట్లాడుతూ , ఇసుక అక్రమ రవాణాను ఎవరైనా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ఆక్రమణదారులు సంబంధిత వ్యక్తులపై దాడులకు తెగబడుతున్నారన్నారు. ఇసుక సమాచారం ఇచ్చిన వారిపై తప్పుడు కేసులు పెడుతూ , వేధిస్తున్నారని వాపోయారు. కార్యక్రమంలో ట్రైనీ డెప్యూటీ కలెక్టర్‌ శ్రీనివాసరావు, మండల శాఖ అధికారులు పాల్గొన్నారు.