ముఖ్యమంత్రి సీట్లో ఆసీనులైన పన్నీర్‌సెల్వం

చెన్నై,ఫిబ్రవరి17(జ‌నంసాక్షి ): ఇక జయలిత ఇప్పట్లో తమిళనాడు సిఎం కాదన్న రూఢీ కావడంతో తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఎట్టకేలకు మంగళవారం  ముఖ్యమంత్రి స్థానంలో ఆసీనులయ్యారు. ఇంతకాలం పక్కసీటు వేసుకుని ఆయన విధులు నిర్వహిస్తున్నారు. జయలలిత జైలుకెళ్లడంతో ఆమె స్థానంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన పన్నీర్‌సెల్వం బినావిూ ముఖ్యమంత్రిగా విమర్శల పాలయ్యారు. ప్రతి ఒక్కరూ ఆయనను విమర్శలు చేస్తుండడంతో జయ ఆదేవాలతో ఆయన సీట్లో ఆసీనులైనట్లు తెలుస్తోంది. శాసనసభలో సైతం ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోకుండా పక్కన కూర్చోవడం తీవ్ర విమర్శలకు తెరలేపింది. దాంతో ఎట్టకేలకు ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. ఇదిలావుంటే  శ్రీరంగంలో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించిన అన్నాడీఎంకే అభ్యర్థి వలర్మతిని సిఎం పన్నీర్‌ సెల్వం, అన్నా డిఎంకె అధినేత్రి జయలలిత అభినందించారు. ఇదిలావుంటే కాంచీపురంతో పాటు పలుచోట్ల అన్నా పార్టీ నాయకులు, కార్యకర్తలుభారీగా విజయోత్సవాలు  నిర్వహించారు.  శ్రీరంగం శాసన సభ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి వలర్మతి ఘన విజయంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకొన్నారు. అరక్కోణం అన్నాడీఎంకే కార్యకర్తలు, నిర్వాహకులు పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు మిఠాయిలు పంచి పెట్టారు.