ముస్లిం మహిళల ఉపాధికి 56 శిక్షణ కేంద్రాలు

ఎమ్మెల్సీ పీర్‌ షబ్బీర్‌ అహ్మద్‌
మెట్‌పల్లి,(జనంసాక్షి): అర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ముస్లిం మహిళల సంక్షేమానికి జమియత్‌ ఉలెమాయె హింద్‌ సంస్థ కృషి చేస్తుందని సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పీర్‌ షబ్బీర్‌అహ్మద్‌ అన్నారు. మంగళవారం రాత్రి మెట్‌పల్లి మదరస ఉమ్మె సలీమాలో కుట్లు అల్లికల్లో శిక్షణ పొందిన వారికి ధ్రువపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సంస్థ ఆధ్వర్యంలో 56 శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆయా కేంద్రాల్లో కుట్టు, కుందన్‌, మెహందీ డిజైన్‌లో శిక్షణ ఇవ్వడంతో పాటు రుణ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 7332 మంది మహిళలకు శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించామన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కొమొరెడ్డి రామ్‌లు శిక్షణ పొందిన 52 మందికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మౌలానా సజ్జాత్‌ఉస్సేన్‌ఖాస్మి, ఖారి మహ్మద్‌ ఉల్‌ హసన్‌, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు