మేం అధికారంలోకి రాగానే.. 

పన్నుల విధానంలో సమూల మార్పులు చేస్తాం
– పెద్దనోట్ల రద్దుతో ఎవరికి ప్రయోజనమో తెలీలేదు
– బ్యాంకింగ్‌ రంగాన్ని ప్రక్షాళన చేస్తాం
– యువ పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యలను పరిష్కరిస్తాం
– యువపారిశ్రామిక వేత్తల భేటీలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ
హైదరాబాద్‌, ఆగస్టు14(జ‌నం సాక్షి) : పెద్దనోట్ల రద్దుతో దేశంలోని మధ్య, పేద తరగతి వర్గాల ప్రజల జీవితాలు ఛిన్నాభిన్నం అయ్యాయని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే పన్నుల విధానంలో సమూల మార్పులు చేయనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధానిలో రెండో రోజు మంగళవారం పర్యటిస్తోన్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. యువ పారిశ్రామిక వేత్తలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ¬టల్‌ తాజ్‌ కృష్ణలో జరిగిన ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 150 మందికిపైగా యువ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. నారా బ్రాహ్మణి, దగ్గుబాటి సురేష్‌ బాబుతో పాటు పలు కీలక సంస్థలకు చెందిన సీఈవోలతో రాహుల్‌ వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాహుల్‌ మోదీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. జీఎస్టీ అమల్లో లోపభూయిష్టమైన విధానాల వల్ల చిన్న, మధ్యతరహా సంస్థలు తీవ్రంగా నష్టపోయానని రాహుల్‌ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే పన్నుల విధానంలో సమూల మార్పులతో పాటు ఒకే శ్లాబ్‌ విధానాన్ని తీసుకురానున్నట్లు హావిూ ఇచ్చారు. అలాగే బ్యాంకింగ్‌ రంగాన్ని ప్రక్షాళన చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయంగా పనిచేయనున్నట్లు పేర్కొన్నారు. పారిశ్రామిక విధానాలు, తెలుగు రాష్ట్రాల వృద్దిరేటు, ఉద్యోగ, ఉపాధి కల్పనపై చర్చించిన రాహుల్‌ అరగంట పాటు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. జీఎస్టీ అమల్లో ప్రభుత్వ విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని, ఈ లోపాల కారణంగా చిన్న, మధ్య స్థాయి సంస్థలు తీవ్రంగా
నష్టపోతున్నాయని విమర్శించారు. ఉద్యోగాల కల్పనలో దేశం వెనుకబడిపోయిందని, చైనాలో రోజుకు 50 వేల ఉద్యోగాలను సృష్టిస్తుంటే మన దేశంలో కేవలం 450 మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు అనేది ఎవరికి ప్రయోజనం చేకూర్చిందో అంతుపట్టడం లేదన్నారు. సులభతర వ్యాపార నిర్వహణ, ప్రోత్సాహకాలు లాంటివి మాటలకే పరిమితమయ్యాయని విమర్శించారు. తమ ప్రభుత్వంలో యువ పారిశ్రామికవేత్తలకు అవసరమైన అన్ని సరళీకృత విధానాలను తీసుకొస్తామని చెప్పారు. ప్రస్తుతం పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికి శాశ్వత పరిష్కారాలు చూపుతామని రాహుల్‌ హావిూ ఇచ్చారు.