మేధోమథనం మార్మోగిన జై తెలంగాణ

తెలంగాణ అమరులకు నివాళులర్పించాలని
పొన్నం పట్టు
బొత్స, పొన్నం మధ్య వాగ్వాదం
ఆజాద్‌ జోక్యంతో నివాళులర్పించిన సదస్సు
బయటపడ్డ బొత్స, సీమాంధ్ర రంగు
హైదరాబాద్‌, డిసెంబర్‌ 16 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కాంగ్రెస్‌ మేధోమథన సదస్సులో జై తెలంగాణ నినాదాలు మార్మోగాయి. కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసిన విద్యార్థులు, యువకులకు సదస్సు పక్షాన నివాళులర్పించాలని డిమాండ్‌ చేశారు. దీనికి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నిరాకరించారు. పొన్నం రెట్టించడంతో జోక్యం చేసుకున్న బొత్స తెలంగాణ అమరవీరులతో పాటు నీలం తుఫాను మృతులకు నివాళి అర్పించాలని సూచిస్తూ ఒక నిమిషం మౌనం పాటించాలని ప్రకటించారు. అమరవీరులకు కూర్చుని నివాళి అర్పించడాన్ని పొన్నం తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణ అమరవీరులను దారుణంగా అవమానించారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అమరవీరులకు నిల్చుని మౌనం పాటించాలని డిమాండ్‌ చేశారు. ప్రతినిధులంతా లేచి నిల్చోవాలని, వేదికపై ఉన్నవారు కూడా నివాళులర్పించాలని విజ్ఞప్తి చేశారు. వేదికపై ఉన్న ముఖ్యులు కొందరు లేచేందుకు సిద్ధపడగా పీసీసీ అధ్యక్షుడు అడ్డుపడి కూర్చోబెట్టారు. సభకు కొన్ని సంప్రదాయాలు ఉంటాయని వాటిని గౌరవించాలని పొన్నంకు తీవ్రస్వరంతో సూచించారు. అదే సమయంలో నిర్వాహకులు పొన్నం మైక్‌ కట్‌ చేశారు. దీంతో ఒక్కసారిగా వేదిక ఎదుట ఉన్న తెలంగాణ ప్రతినిధులు నిల్చుని జై తెలంగాణ నినాదాలు చేశారు. సభా ప్రాంగణమంతా నినాదాలతో మార్మోగడంతో కొద్దిసేపు గందరగోళం చోటుచేసుకుంది. అప్పుడే ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి పొన్నం నుంచి మైక్‌ లాగేసుకున్నారు. దీంతో ఆందోళన తీవ్రరూపం దాల్చింది. బొత్స, పొన్నం తీవ్రస్థాయిలో వాగ్వాదం చేసుకున్నారు. పరిస్థితి చేయి దాటిపోతుందని ఆలస్యంగా గుర్తించిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నభీఆజాద్‌ జోక్యం చేసుకుని తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులతో పాటు నీలం తుఫాను మృతులకు రెండు నిమిషాలు నివాళి అర్పించాలని సూచించారు. పీసీసీ అధ్యక్షుడు అడ్డుకున్నా అమరులకు నివాళి అర్పించేలా చేసిన పొన్నం ప్రభాకర్‌ను సదస్సుకు హాజరైన తెలంగాణ ప్రాంత ప్రతినిధులు హీరోగా అభివర్ణించారు. ప్రజల మనోభావాలను సభా వేదికపై చూపేందుకు ఆయన చూపిన తెగువను పలువురు ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో అధిష్టానంపై ఒత్తిడి పెంచి ప్రత్యేక రాష్ట్రం సాధించుకురావాలని సూచించారు. ఇంతకాలం తెలంగాణ ప్రజల మనోభావాలు గౌరవిస్తామని, తెలుగువారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేంటంటూ వ్యాఖ్యానించిన బొత్స అసలురంగు మేధోమథనం సాక్షిగా బయటపడింది. ఇరు ప్రాంతాలకు ఆమోదయోగ్యుడిగా పీసీసీ పదవి పొందిన బొత్స ఇప్పుడు ఇలా మాట్లాడటం ఎంతమాత్రం సరికాదని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు.