మైనర్లు పట్టుబడితే జైలుకే

Drink-driving-Cases
హైదరాబాద్‌,జూలై12(జనంసాక్షి):

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో మైనర్లు పట్టుబడితే వారి తల్లిదండ్రులకు మూడు రోజుల పాటు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని.. మద్యం సరఫరా చేసినవారిపైన, వాహనాలు ఇచ్చిన వారిపైనా క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్‌ డీసీపీ ఎల్‌ఎస్‌.చౌహాన్‌ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-12లోని బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం మధ్యాహ్నం తాము చేపట్టిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో 108 కేసులు నమోదుకాగా ఇందులో 15 మంది మైనర్లు దొరికారని వెల్లడించారు. మైనర్లకు మద్యం సరఫరా చేసినట్లు రుజువైతే వైన్‌షాప్‌లు, పబ్‌లు, బార్లపై కూడా క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తామని వాటి లైసెన్స్‌ కూడా రద్దు చేయాలని ఎక్సైజ్‌ శాఖను కోరతామన్నారు. ఇక నుంచి పగటి పూట డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కొనసాగుతుందని పేర్కొన్నారు. కేబీఆర్‌ పార్కు నుంచి జూబ్లీహిల్స్‌ చౌరస్తా వరకు బైక్‌, కారు రేస్‌లు జరుగుతున్నాయని, రెండుసార్లు పట్టుబడితే వారిపై లా అండ్‌ ఆర్డర్‌ కేసులు నమోదు చేసి డేంజర్‌ డ్రైవ్‌ కింద శిక్షలు పడేలా చేస్తామన్నారు. ఇకపై తెల్లవారుజామున 3 గంటల వరకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేపడతామని కూడా చెప్పారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడి చేస్తే ఐపీసీ 353 కింద కేసు నమోదు చేస్తామని చార్జిషీట్లు కూడా వేస్తామన్నారు. మళ్లీ మళ్లీ తప్పు చేసేవారి డేటాను అప్‌లోడ్‌ చేస్తున్నామని, ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్టు తదితర ధ్రువీకరణ పత్రాల నంబర్లను నమోదు చేయడం జరుగుతుందని, ఒకసారి క్రిమినల్‌ కేసు నమోదైతే వీరు ఎక్కడికీ వెళ్లకుండా శిక్షలుంటాయని, లైసెన్స్‌ కూడా రద్దవుతుందని హెచ్చరించారు. తాగి వాహనం నడిపి దొరికితే ఇక నుంచి 304(2)కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందని చెప్పారు. మైనర్లు వాహనం నడుపుతూ దొరికినా, మద్యం సేవించి పట్టుబడ్డా వారు చదువుకునే పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలకు లేఖలు రాస్తామని, వారిని డీబార్‌ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.