మొక్కల పెంపకంపై చైతన్యం అవసరం

శ్రీకాకుళం, ఆగస్టు 1 : ఆరోగ్యవంతమైన జీవనానికి పచ్చని చెట్ల పెంపకం అవసరమని, దీనికోసం ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యతను విద్యార్థులు తీసుకోవాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళం పట్టణంలోని స్థానిక ప్రభుత్వ పురుషుల కళాశాలలో జరిగిన వనమహోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చెట్ల పెంపకంపై ఆసక్తి ఉన్న వారందరికీ ఉచితంగా మొక్కలు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌ మాట్లాడుతూ వనమహోత్సవ కార్యక్రమం సందర్భంగా జిల్లాలో రెండు లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్‌, అటవీశాఖ కన్జర్వేటర్‌ కె.సూర్యనారాయణ, జిల్లా అటవీశాఖ అధికారి విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.