మొద్దు నిద్రలో కాంగ్రెస్‌ ప్రభుత్వం

ఖమ్మం, జూలై 10 : రాష్ట్రంలో రైతులు అనేక కష్టాలు పడుతుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ టిఇసి సభ్యులు అజయ్‌కుమార్‌ విమర్శించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులందరూ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను ప్రజలకు వివరించాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ బాటలో యువత ప్రయాణించాలన్నారు. అదేవిధంగా రైతులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం ముందుండాలన్నారు. వైఎస్‌ఆర్‌ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం నీరుగారుస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు అందకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. గత ఉప ఎన్నికల్లో పాలక, ప్రతిపక్ష పార్టీలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయని ఆయన అన్నారు. జగన్మోహన్‌రెడ్డికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే అక్రమ కేసులు బనాయించారన్న విషయం ప్రజలకు అర్థమైందన్నారు. వచ్చే ఎన్నికల్లోపు రాష్ట్రంలో రాజకీయంగా పెనుమార్పులు సంభవిస్తాయన్నారు.