యాంకర్ బద్రి అంత్యక్రియలు పూర్తి
హైదరాబాద్ జనంసాక్షి : రోడ్డు ప్రమాదంలో మరణించిన ప్రముఖ న్యూస్ యాంకర్ బద్రి అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం విజయవాడలో పూర్తయ్యాయి. ఆయన భౌతిక కాయాన్ని కడసారి వీక్షించేందుకు ఆయన ఆత్మీయులు పెద్దఎత్తున తరలివచ్చారు. కాగా పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం మారంపల్లి రహదారిపై ఆదివారంనాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో బద్రి మృతి చెందిన సంగతి తెలిసిందే.
బద్రి ప్రయాణిస్తున్న కారు టైరు పేలడంతో కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుమారుడు సాయి సాత్విక్ కూడా ఏలూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. బద్రి భార్య సుజాత ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నారు.
బద్రి ఆకస్మిక మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రముఖ రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా విజయవాడలోని సమాచార కేంద్రానికి బద్రి పేరును పెట్టాలని జర్నలిస్టులు కోరారు. అలాగే యాంకర్స్ అసోసియేషన్ కూడా బద్రి పేరుతో అవార్డును ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.