యూపీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా హమీద్‌ అన్సారీ

న్యూఢిల్లీ, జూలై 14 (జనంసాక్షి) : ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా హమీద్‌ అన్సారీ పేరును యుపిఎ కూటమి ఖరారు చేసింది. శనివారం సాయంత్రం ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో కోర్‌ కమిటీ భేటీ అయింది. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా హమీద్‌ అన్సారి పేరును యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ ప్రతిపాదించారు. యుపిఎ కూటమిలోని భాగస్వామ్య పక్షాలు ఆమె ప్రతిపాదనను బలపర్చాయి. అంతేగాక రాజ్యసభ చైర్మన్‌గా అన్సారీ ఉత్తమమైన సేవలు అందించారని చెప్పాయి. ఆయన అన్ని విధాలా ఉప రాష్ట్రపతి పదవికి అర్హుడని కొనియాడాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ సిఎం మమతాబెనర్జీ మాత్రం హమీద్‌ అన్సారి పేరును వ్యతిరేకించారు. అంతేగాక మాజీ గవర్నర్‌ గోపాలకృష్ణ గాంధీ పేరును ఆమె ప్రతిపాదించిన విషయం తెలిసిందే.