రత్నగిరికి గ్యాస్‌ రద్దు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి అయిన గ్యాస్‌ను మహారాష్ట్రలోని రత్నగిరి ప్లాంట్‌కు కేటాయిం చడంతోపాటు మన రాష్ట్రంలో గ్యాస్‌ ప్లాంట్లు మూతపడి తీత్ర విద్యుత్‌ సంక్షోభం తలెత్తే ప్రమాదం నేపథ్యంలో ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌తో సమావేశమై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ తీసుకొన్న చొరవ ఫలించింది. రత్నగిరి ప్లాంట్‌కు సరఫరా చేయడం కోసం మన రాష్ట్ర కోటా నుంచి 2 ఎంఎంఎస్‌సిఎండి పరిమాణంలో పెట్టిన గ్యాస్‌ కోతాను పునరుద్ధరించాల్సిందిగా మంగళవారం కేంద్ర పెట్రోలియం, విద్యుత్‌ శాఖలకు ప్రధాని ఆదేశాలు జారీ చేశారు. సోమవారం మన ఎంపీలు 33 మందితో కలిసి ముఖ్యమంత్రి కిరణ్‌ ప్రధానిని కలిసి వచ్చిన తర్వాత గ్యాస్‌ కేటాయింపుపై రాష్ట్రానికి మేలు జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని నుండి సానుకూల స్పందనకు ఎక్కువ అవకాశం ఉందని, రాష్ట్రానికి గ్యాస్‌ లేదా అదనపు విద్యుత్‌ కేటాయింపు జరగవచ్చని మంగళవారం కేంద్ర పెట్రోలియం మంత్రి జైపాల్‌రెడ్డి సైతం వ్యాఖ్యానించడంతో అప్పటి వరకూ ఉన్న వేడి వాతావరణం చల్లబడింది. ప్రధాని తాజా ఆదేశాల నేపథ్యంలో ప్రస్తుత పరిణామంపై ఎపి ట్రాన్స్‌కో వర్గాలు స్పందించాయి. ప్రధాని నుంచి రెండు మంత్రిత్వ శాఖలకూ ఆదేశలు వచ్చినందున ఇవి తక్షణం అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రధాన మంత్రితో సమావేశమైన సిఎం కిరణ్‌, విద్యుత్‌, గ్యాస్‌ విషయంలో రాష్ట్రం ఎదుర్కొంటున్న సంక్షభం, అన్యాయం గురించి గట్టిగా వాదించినందునే దాని ఫలితం మంగళవారం కన్పించిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. తాజా పరిమాణం నేపథ్యంలో రత్నగిరి ప్లాంట్‌కు గ్యాస్‌ కేటాయింపు రద్దు చేయాలని రిలయన్స్‌ సంస్థకు పెట్రోలియం మంత్రి జైపాల్‌రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించినందుకు సిఎం ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.