రాజకీయ పక్షాలతో ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ భేటీ

ఓటర్ల జాబితాపై నేతల అభ్యంతరం

ముందస్తు సమాచారం లేదన్న ఎన్నికల అధికారి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): ముందస్తు ఎన్నికలకు సంబంధించి కేవలం ఊహాగానాలే వినిపిస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ అన్నారు. తాము సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నడుచుకుంటున్నామని అన్నారు. ఒకవేళ శాసనసభను రద్దు చేస్తే, ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయిస్తే అందుకు అనుగుణంగా తాము నడుచుకుంటామని ఆయన చెప్పారు. షెడ్యూల్‌ ప్రకారం జరగాల్సిన ఎన్నికలకు సంబంధించిన పక్రియను తాము కొనసాగిస్తున్నామని… అందులో భాగంగానే ఓటర్ల జాబితా సవరణ పక్రియపై రాజకీయపార్టీలతో సమావేశం నిర్వహించినట్లు రజత్‌ కుమార్‌ తెలిపారు. రాష్ట్రానికి 84వేలకు పైగా వీవీప్యాట్‌, కంట్రోల్‌ యూనిట్లు, లక్షా 23వేల బ్యాలెట్‌ యూనిట్లు అవసరమని… ఈసీఐఎల్‌ లో అవి సిద్ధమవుతున్నాయనిచెప్పారు. తెలంగాణ చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి రజత్‌ కుమార్‌ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ, వామపక్ష నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఓటర్ల జాబితా సవరణల పక్రియపై చర్చలు జరిపారు. అక్టోబర్‌ 31 వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని రజత్‌కుమార్‌ చెప్పారు. 2014 ఎన్నికల ముసాయిదా ప్రకారం 2.81 కోట్ల ఓటర్లు ఉన్నారని, ప్రస్తుతం 2.61 కోట్ల ఓటర్లు ఉన్నారని ఆయన తెలిపారు. ఆధార్‌ బేసెస్‌, డూప్లికేషన్‌తో ఓటర్ల సంఖ్య తగ్గిందన్నారు. షెడ్యూల్‌ ప్రకారం జరగాల్సిన ఎన్నికల పక్రియ కొనసాగిస్తున్నామని, కొన్ని పార్టీలు బ్యాలెట్‌ బాక్స్‌లు కావాలని కోరాయని ఆయన అన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామని రజత్‌కుమార్‌ పేర్కొన్నారు.