రాష్ట్ర కాంగ్రెస్‌లో వేడెక్కిన రాజకీయాలు- హస్తిన కేంద్రంగా నేతల పావులు

– అధినేత్రి సోనియాకు నివేదనల తాకిడి

భవిష్యత్‌ వ్యూహాలపై నరసింహన్‌ సలహాలు
న్యూఢిల్లీ, జూన్‌ 27 : రాష్ట్ర రాజకీయాలు మళ్లీ ఒక్కసారిగా వేడెక్కాయి. ఉప ఎన్నికల తర్వాత పరిస్థితి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారుతాయని భావించినప్పటికీ మరీ ఇంతలా మారుతాయని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. ప్రధానంగా అధికార కాంగ్రెస్‌ పార్టీలో వ్యూహాలు ఊపందుకున్నాయి. హస్తిన కేంద్రంగా రాష్ట్ర నాయకులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌ దగ్గర నుంచి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తదితరులు అధినేత్రి సోనియా గాంధీ వద్ద తమ నివేదనలను ఉంటే పనిని వేగవంతం చేశారు. తెలంగాణ అంశంతో పాటుగా రాష్ట్ర కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణకు కాంగ్రెస్‌ అధిష్ఠానం తుది మెరుగులు దిద్దేపనిలో ఉన్నదంటూ వినిపిస్తున్న ఊహాగానాలకు మరింత ఊతమిస్తున్నట్లుగా గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ న్యూఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలతో విస్తృతమైన మంతనాల్లో గడిపారు. అదే సమయంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ ఎంపిలు సైతం కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన మంత్రులతో వరుస సమావేశాల్లో నిమగ్నమయ్యారు. సోమవారం నుంచి ఢిల్లీలో బస చేసిన నరసింహన్‌ తొలుత ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని ఆమె నివాసంలో కలుసుకున్నారు. రాష్ట్రప్రభుత్వం పనితీరు, ఇటీవలి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమిపై ఒక నివేదికను గవర్నర్‌ ఆమెకు సమర్పించినట్లు తెలిసింది. అయితే అనంతరం నరసింహన్‌ దానిని తోసిబుచ్చారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కేంద్రమంత్రి చిదంబరంతో నరసింహన్‌ వేర్వేరుగా భేటీ అయ్యారు. తర్వాత యుపిఎ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీని సైతం గవర్నర్‌ మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఢిల్లీలో బస చేసిన గవర్నర్‌ పార్టీ అధిష్ఠానం నేతలతో సమావేశమవుతన్న తరుణంలో ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమిపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సోనియాగాంధీకి భిన్నమైన నివేదికలు సమర్పించినందున ఓటమి వెనక సరైన కారణాలను తెలుసుకునేందుకు అధిష్ఠానం నరసింహన్‌ను ఢిల్లీకి పిలిపించి ఉండవచ్చని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు విశ్వసించారు. రాష్ట్రపతి పదవికి ఎన్నికలు పూర్తయిన తర్వాత గవర్నర్‌, ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు సమర్పించిన నివేదికలకు అనుగుణంగా రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ కేబినెట్‌ సమూల ప్రక్షాళనకు పార్టీ అధిష్ఠానం పూనుకుంటుందని కొందరు నేతలు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపిలు రక్షణ శాఖమంత్రి ఎ.కె. అంటోని, ప్రవాస భారతీయుల వ్యవహారాల శాఖమంత్రి వాయిలర్‌ రావి, కేంద్ర హోంమంత్రి చిదంబరాన్ని కలుసుకున్నారు. ఇటీవల ఉప ఎన్నికల్లో సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీ మూలాలు పెకలించుకుపోయినందున ప్రత్యేక తెలంగాణ అంశానికిి అనుకూలంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరారు. చిదంబరాన్ని కలిసిన అనంతరం తెలంగాణ ఎంపిలు మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం త్వరలో సాకారం కానుందని తెలిపారు. మరోవైపు పార్టీ అధిష్ఠానం ఆదేశాలకు లోబడి తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు గత రాత్రి హుటాహుటిన న్యూఢిల్లీకి బయలుదేరారు. తెలంగాణ అంశంపై సానుకూల నిర్ణయం కోసం పారీ2్ట అధిష్ఠానాన్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలనే దానిపై మంత్రి కె.జానారెడ్డి, పిసిసి మాజీ అధినేత డి.శ్రీనివాస్‌ కేంద్ర పెట్రోలియం శాఖమంత్రి జైపాల్‌రెడ్డితో సమావేశాలు నిర్వహించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ” రాష్ట్రపతి పదవికి ఎన్నికలు ముంచుకొస్తున్నందున మా పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి పెంచేందుకు ఇదే సరైన సమయం. తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా ఒక ప్రకటన చేసిన పక్షంలో టిఆర్‌ఎస్‌ అధినేత కేసిఆర్‌ సైతం తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారు” అని ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్‌ మాజీ ఎంపి ఒకరు అభిప్రాయపడ్డారు. కాగా, కేంద్రమంత్రి పనబాక లక్ష్మి, రాష్ట్రమంత్రి డిఎల్‌ రవీంద్రనాధ్‌, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి సైతం వేర్వేరుగా సోనియాను కలుసుకొని రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిని వివరించినట్లు సమాచారం. హస్తినలో నడుస్తున్న తాజా రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేస్తే కాంగ్రెస్‌కు కాయకల్ప చికిత్స మొదలైనట్టేనని భావించాలి. వరుస పరాజయాలతో రాష్ట్ర కాంగ్రెస్‌ కుదేలుకావడంతో అధిష్ఠానం రాష్ట్ర రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉప ఎన్నికల ఫలితాలపై నరసింహన్‌ అభిప్రాయాలను ఆమె తీసుకున్నట్లు తెలిసింది. తెలంగాణ అంశంపై కూడా చర్చించినట్లు తెలిసింది. ఉప ఎన్నికల్లో పరాజయం నేపథ్యంలో తెలంగాణ అంశంపై అధిష్ఠానంపై ఒత్తిడి పెరుగుతున్న విషయం తెల్సిందే. అయితే తాను సోనియాగాంధీకి ఎలాంటి నివేదిక ఇవ్వలేదని నరసింహన్‌ విలేకరులకు తెలిపారు. ఢిల్లీ పెద్దలందరినీ కలుస్తున్నట్లు చెప్పారు. కాగా, ఢిల్లీలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపిలు గవర్నర్‌ నరసింహన్‌తో సమావేశమయ్యారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి విషయంలో జరుగుతున్న జాప్యాన్ని వివరించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు. తెలంగాణను వ్యతిరేకించే వారితో మాట్లాడి, ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్‌ విశ్లేషణ, భవిష్యత్‌ కార్యాచరణపై పది మంది మంత్రులతో అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు. పార్టీ ప్రస్తుత పరిస్థితిని విశ్లేషించడంతో పాటు గత ఉప ఎన్నికల్లో ఓటమి, ప్రభుత్వ కార్యకలాపాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పార్టీపరంగా ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలన్న అంశంపై ఈ కమిటీ దృష్టి సారించనుంది. మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. రాష్ట్రమంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, ఎస్‌.రఘువీరారెడ్డి, పితాని సత్యనారాయణ, డికె అరుణ, తోట నరసింహం, పి.విశ్వరూప్‌, సి,రామచంద్రయ్య, బసవరాజు సారయ్య ఈ కమిటీలో సభ్యులుగా నియమితులయ్యారు. అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల్లో లోటుపాట్లను అధ్యయనం చేసేందుకు కూడా ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది.