రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని మనుషుల్లా చూడడం లేదు: వెంకటవీరయ్య

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రజల్ని మనుషుల్లా చూడడం లేదని తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ధ్వజమెత్తారు. గ్రామల్లో రాహదారులు బురద కాలువల్లా ఉన్నాయని, పారిశుద్ధ్యం పడకేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన రూ.1500 కోట్లు ఆగిపోయాయాన్నారు. పురపాలక ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన రూ.800 కోట్లు కూడా ఆగిపోయాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రం సమస్యలతో అతలాకుతలం అవుతుంటే కేవలం ఐదురోజుల పాటు సభను మొక్కుబడిగా నిర్వహించడం తగదన్నారు. కనీసం 20 రోజులు నిర్వహించాలని కోరారు.