రాష్ట్ర విభజనకు మద్దతు ఇస్తే తెదేపా నెతల ఇళ్లు ముట్టడిస్తాం

పీలేరు: రాష్ట్ర విభజనకు తెదేపా మద్దతు ఇస్తే రాయలసీమలో తెదేపా నేతల ఇళ్లు ముట్టడిస్తామని రాయలసీమ విద్యార్థి సంయుక్త కార్యచరణ కమిటీ సహ కన్వీనర్‌ కిషోర్‌కుమార్‌ హెచ్చరించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండు వద్ద రస్తారోకో చేసిన అనంతరం చంద్రబాబు బ్యానర్‌ను కాల్చివేశారు. చంద్రబాబు తెలంగాణ నిర్ణయాన్ని నిరసిస్తూ కమిటీ ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులు పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కిషోర్‌కుమార్‌ మాట్లాడుతూ తెలుగు ప్రజల ఐక్యత కోసం ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించారని, చంద్రబాబు స్వార్ధ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని విడగొట్టేందుకు ప్రయత్నించడం ఘోరమన్నారు. తెలంగాణా పై లేఖ నిర్ణయాన్ని తెదేపా వెనక్కి తీసుకోవాలని, సమైక్యాంధ్రకు కట్టుబడి ఉండాలని డిమాండ్‌ చేశారు.