రివల్యుషనరి సోషలిస్టు పార్టీ ( R.S.P. ) ఎం.పీ. ప్రేమ చంద్రన్ తో బోయినపల్లి వినోద్ కుమార్ భేటీ

 

జాతీయ రాజకీయాలపై మంతనాలు

జాతీయ రాజకీయాల్లో కేసిఆర్ రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్న ప్రేమ చంద్రన్

ప్రేమ చంద్రన్, వినోద్ కుమార్ భేటీ రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది

 

రివల్యుషనరి సోషలిస్టు పార్టీ ( R.S.P. ) సీనియర్
నాయకులు, కేరళ రాష్ట్రం కొల్లాం పార్లమెంటు సభ్యులు, మాజీ మంత్రి ఎన్.కే. ప్రేమ చంద్రన్ తో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ శుక్రవారం హైదరాబాద్ లో సమావేశమయ్యారు.

ప్రేమ చంద్రన్ ఆహ్వానం మేరకు
వినోద్ కుమార్ మర్యాద పూర్వకంగా బంజారాహిల్స్ లోని హోటల్ హయాత్ లో కలిసి పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా జాతీయ స్థాయి రాజకీయాలపై, ఇతర పలు అంశాలపై వారు చర్చించారు.

జాతీయ స్థాయిలో రాజకీయంగా బలమైన విపక్షం లేకుండా పోయిందని, దీంతో బీజేపీ ఆటలు సాగుతున్నాయని ప్రేమ చంద్రన్ అభిప్రాయ పడ్డారు.

ఈ నేపథ్యంలో టీ.ఆర్.ఎస్. పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జాతీయ రాజకీయాలలోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రేమ చంద్రన్ తన ఆసక్తిని వ్యక్తం చేశారు.

జాతీయ స్థాయిలో వివిధ రాజకీయ పార్టీలను, వివిధ రంగాల ప్రముఖులను ఒక తాటిపై తీసుకుని రావాల్సిన అవసరం ఉందని ప్రేమ చంద్రన్ ఈ సందర్భంగా తన మనసులోని మాటను వినోద్ కుమార్ తో పంచుకున్నారు.

ప్రస్తుత జాతీయ రాజకీయాలలో కేసిఆర్ రాజకీయంగా బలమైన ప్రభావాన్ని చూపగలరని, కేసిఆర్ వ్యూహాలు చాలా పదునుగా ఉంటాయని కేరళ రాష్ట్రం పార్లమెంటు సభ్యులు ప్రేమ చంద్రన్ స్పష్టం చేశారు.

నాలుగు సార్లు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికవడమే కాకుండా కేరళ రాష్ట్రం జల వనరుల శాఖ మంత్రిగా విశేష అనుభవం ఉన్న ప్రేమ చంద్రన్ బెస్ట్ పార్లమెంటేరియన్ గా, సంసద్ రత్న అవార్డు గ్రహీతగా హైదరాబాద్ రావడంతో ప్రేమ చంద్రన్ ఆహ్వానం మేరకు వినోద్ కుమార్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

పార్లమెంటులో సహచర ఎం.పీ. గా ఉన్నప్పటి నుంచి ప్రేమ చంద్రన్ తో ఉన్న అనుబంధాన్ని వినోద్ కుమార్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

కేరళ రాష్ట్రం పార్లమెంటు సభ్యులు ప్రేమ చంద్రన్ తో బోయినపల్లి వినోద్ కుమార్ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ భేటీలో ఆర్.ఎస్.పీ. రాష్ట్ర నాయకులు శ్రీ కే. రేజీ కుమార్, శ్రీ వీ. సునీల్ లు కూడా ఉన్నారు.