రేపు గ్రేటర్‌ ఎన్నికల కౌంటింగ్

పక్కాగా ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం
30 కేంద్రాల్లో 166 కౌంటింగ్‌ టేబుళ్ల ద్వారా లెక్కింపు
హైదరాబాద్‌,డిసెంబర్‌3 (జనంసాక్షి) : జీహెచ్‌ఎంసీ ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. గ్రేటర్‌లోని 150 డివిజన్లకు సంబంధించి ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్‌ బ్యాలెట్లు, తర్వాత బ్యాలెట్‌ పత్రాలను లెక్కిస్తారని ఎస్‌ఈసీ ప్రకటించింది. ఓట్ల లెక్కింపు కోసం 30 కేంద్రాల్లో 166 కౌంటింగ్‌ టేబుళ్లను ఏర్పాటు చేసింది. ఒక్కో డివిజన్‌కు 14 టేబుళ్లతో కౌటింగ్‌ హాల్‌ను ఏర్పాటు చేశారు. అయితే కౌంటింగ్‌ హాల్‌ చిన్నగా ఉన్న 16 డివిజన్లకు రెండు హాళ్లను కేటాయించారు. ఒక్కో కౌంటింగ్‌ హాల్‌లో రిటర్నింగ్‌ అధికారి, సహాయ రిటర్నింగ్‌ అధికారి ఉంటారని తెలిపింది. ప్రతి కౌంటింగ్‌ కేంద్రానికి పరిశీలకుడిని నియమించింది. అభ్యర్థులు ఒక్కో టేబుల్‌కు ఒక ఏజెంట్‌ను నియమించుకునే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఏజెంట్లకు రిలీవింగ్‌ సౌకర్యం లేదని స్పష్టం చేసింది. కౌంటింగ్‌ హాళ్లలోకి మొబైల్‌ఫోన్లు తీసుకెళ్లడంపై నిషేధం విధించింది. ఏజెంట్లు రిటర్నింగ్‌ అధికారుల వద్ద పాసులు తీసుకోవాలని ప్రకటించింది. పాసులు లేనివారికి అనుమతి లేదని వెల్లడించింది. అన్ని కౌంటింగ్‌ హాళ్లలో వీడియోగ్రఫీ, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఎన్నికల పరిశీలకుడి అనుమతి తర్వాత ఫలితాలు ప్రకటిస్తామని, అనుమానిత ఓట్లకు సంబంధించి రిటర్నింగ్‌ అధికారిదే తుది నిర్ణయమని స్పష్టం చేసింది. ఫలితాలు ప్రకటించడానికి ముందే రీకౌంటింగ్‌ కోసం రిటర్నింగ్‌ అధికారికి విజ్ఞప్తి చేయాలని సూచించింది. అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే లాటరీ పద్ధతిలో డ్రా తీస్తామని, దానికి అనుగుణంగా తుది ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించింది. మరోవైపు జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వ సిద్ధం కాగా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో  46.55 శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది.  34,50.256 మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటగా మెహదీపట్నం డివిజన్‌ ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఫలితాల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.