రేపు ‘ సమరదీక్ష ‘ : కోదండరాం
హైదరాబాద్: ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా రేపు ‘ సమరదీక్ష ‘ నిర్వహించి తీరుతామని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరించారు. ఇందిరాపార్కు వద్ద నిరసన తెలపడానికి హైకోర్టు అనుమతి ఉన్నా ప్రభుత్వం అనుమతించక పోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి సమరదీక్షకు అనుమతి ఇవ్వాలని కోరారు. ‘ పోలీసులు దీక్షకు అనుమతి నిరాకరించడాన్ని ఆమెకు వివరించామని, దీనిపై హోంమంత్రి స్పందిస్తూ గంటలోగా సమాధానం చెబుతానని అన్నారని కోదండరాం తెలిపారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా తెలంగాణ వాదులు దీక్షకు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. పోలీసులు తెలంగాణవాదులను ఆపివేస్తే ఎక్కడికక్కడ దీక్షలు చేయాలని ఆయన కోరారు. రోడ్లపైనే బైఠాయించి నిరసనలు తెలుపాలని అన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా దీక్షలు : కోదండరాం
రేపు తెలంగాణ వ్యాప్తంగా సమరదీక్షలు నిర్వహించాలని కోదండరాం పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోనే కాదు తెలంగాణలోని ప్రతి జిల్లా, పట్టణం, గ్రామంలో దీక్షలు కొనసాగించాలని కోరారు. 36 గంటలపాటు దీక్షలు చేయాలని తెలంగాణ వాదులను కోరారు. దీక్షలు ఎలా ఉండాలంటే కేంద్రం దిగివచ్చి తెలంగాణ ఇచ్చేలా ఉండాలని సూచించారు.