రైల్వే ప్రమాదం పై విచారణ చేపట్టినరైల్వే సేఫ్టీ కమిషన్‌ చైర్మన్‌ డి.కె సింగ్‌

నెల్లూరు, ఆగస్టు 3 : ఈ నెల 30న నెల్లూరు నగరంలో జరిగిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ దుర్ఘటనకు సంబంధించి రైల్వే సేఫ్టీ కమిషన్‌ చైర్మన్‌ డి.కె సింగ్‌ స్థానిక నారాయణ ఆసుపత్రిలో విచారణ చేపట్టారు. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బన్సల్‌ (ఆగ్రా), వీణ (న్యూఢిల్లీ), రేఖ (చెన్నై), ప్రశాంత్‌ బన్సల్‌ (ఆగ్రా), డిడి వర్మ (విజయవాడ)లను విచారణ చేపట్టారు. ముందుగా వర్మ మాట్లాడుతూ 30వ తేదీ తెల్లవారు జామున 4గంటల 15 నిముషాల ప్రాంతంలో గులకరాళ్ళు రేకులమీద పడ్డట్టుగా శబ్దం వినవచ్చి ఉలిక్కిపడి లేచానని, అప్పటికే కంపార్టుమెంట్‌లో దట్టమైన పొగలు అల్లుకోగా కంపార్టుమెంట్‌కు తూర్పువైపునున్న ఒకటవ డోర్‌నుంచి మంటలు ఎగసిపడడాన్ని గమనించానని అక్కడ నుండి ఎస్‌-10 కంపార్టుమెంట్‌లోకి పరుగు తీసి, అక్కడ నుంచి తప్పించుకున్నానని అన్నారు. తాను తన నోటి నుంచి పోగలు రావడాన్ని గమినించిన స్థానికులు మంచినీళ్ళు ఇచ్చి ఊరడించారని అన్నారు. 40శాతం కాలిన గాయలతో బాధపడుతున్న వీణ మాట్లాడుతూ ఎస్‌-11 కంపార్టుమెంట్‌లోని బెర్త్‌ నెంబర్‌ 12లో పడుకుని ఉన్నానని, తన వెనుకనే ఉన్న బెర్త్‌ లైట్‌ పగిలిపోవడంతో ఉలిక్కిపడి నిద్రలేచానని అప్పటికే కంపార్టుమెంట్‌లో మంటలతో కూడి దట్టమైన పొగలు వ్యాపించడంతో ఊపిరి పీల్చుకోవడం కష్టమైందని అన్నారు. ఆ స్థితిలో ఉన్న తనను కొందరు వ్యక్తులు కంపార్టుమెంట్‌ నుంచి రక్షించారని తెలిపారు.
ఆగ్రాకు చెందిన వ్యక్తి బన్సల్‌ మాట్లాడుతూ తాను, తన కుమార్తె ప్రశాంత్‌ బన్సల్‌తో కలిసి చెన్నైకు వెళుతున్నానని, తాను 14వ నెంబర్‌ బెర్త్‌లో, తన కుమార్తె 5వ నెంబర్‌ బెర్త్‌లో ప్రయాణిస్తున్నామని అన్నారు. 4గంటల 15 నిముషాల ప్రాంతంలో తన ప్రక్కనే ఉన్న ఎలక్ట్రికల్‌ బోర్డునుంచి ముందుగా పొగలు వచ్చాయని ఆ తరువాత పై నుంచి మంటలు కంపార్టుమెంట్‌కు వ్యాపించాయి. కంపార్టుమెంట్‌లో వున్న మరికొందరు ప్రయాణికులు అరుపులు, కేకలు వేశారు. తన బెర్త్‌ ప్రక్కనే డోర్‌ తీసి ఉండటంతో దూకి తప్పించుకున్నానని అన్నారు. ఈ విధంగా ఎనిమిది మంది ఇచ్చిన వాంగ్మూలాలను రైల్వే సెఫ్టీ కమిషన్‌ రికార్డు చేశారు.
మరో ప్రయాణికుడు మృతి ఈ నెల ముప్పైన తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌కు జరిగిన ప్రమాదంలో ఇప్పటి వరకు 32 మంది మృతి చెందగా శుక్రవారం నాడు మరో వ్యక్తి చెన్నైలో చికిత్స పొందుతూ మరణించాడు. అతను విజయవాడకు చెందిన ఎంవి సాంబశివరావుగా పోలీసులు గుర్తించారు. ఈ దుర్ఘటనలో 80శాతం కాలిన గాయాల పాలైన సాంబశివరావును అదేరోజు చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం 11:30 ప్రాంతంలో అతడు మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సాంబశివరావు భార్య శాంతి చెన్నైలోని సింటెల్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నది. ఆమెను చూసేందుకు సాంబశివరావు వెళుతుండగా ఈ ప్రమాదంలో చిక్కుకుని మరణించాడు.