రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి
పెనుగొండ : అనంతపురం జిల్లాలోని పెనుగొండ సమీపంలోని దొడ్డికుంట ప్రధాన రహ దారిపై శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. అనంతపురం వేణుగోపాల్ నగర్‌కు చెందిన బాబా ఫక్రుద్దీన్ కుటుంబీకులు పెనుగొండ బాబయ్య దర్గాలో ప్రార్ధనలు నిర్వహించి సోమందేపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వెళ్తుండగా దొడ్డికుంట వద్ద వారి ఆటో బోల్తా పడింది. బోల్తాపడిన ఆటోను బెంగుళూరు నుంచి అనంతపురం వెళ్తున్న కారు వెనక వైపు ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఫయాజ్ (17), సబీహా సీమా (9) అక్కడికక్కడే మరణించారు. క్షతగాత్రులను పెనుగొండ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాబా ఫక్రుద్దీన్ (45), పొన్నూరుబీ (60) మృతి చెందారు. గాయపడిన షబానా పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను అనంతపురం వైద్యశాలకు తరలించారు ఎస్సై శ్రీరాంశ్రీనివాస్ సంఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.