లక్ష్మీపేట ఘటనపై సిట్టింగ్‌ జడ్జీ చేత న్యాయ విచారణ

జరపాలిహైదరాబాద్‌, జూన్‌ 25(జనంసాక్షి):
శ్రీకాకుళం జిల్లా లక్ష్మిపేట గ్రామంలో దళితుల ఊచకోత ఘటనపై సిట్టింగ్‌ జడ్జితోగాని, స్వయం ప్రతిపత్తిగల దర్యాప్తు సంస్థతోగాని విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్‌ పౌరహ క్కుల సంఘం రాష్ట్ర నేత రఘునాథ్‌ రాష్ట్రప్ర భుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రతినిధి బృందంతో రాష్ట్ర హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఒక వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ లక్ష్మీపేట ఘటనకు సంబంధించి నిందితులను ఇప్పటి వరకు అరెస్టు చేయకపోడవ అనుమానాలకు తావిస్తోందన్నారు. దళితలను ఊచకోత కోసింది అగ్రకులాలకు చెందిన వారు కావడం వల్లనే ప్రభుత్వం వారిపై చర్య తీసుకోవడంలో తాత్సారం చేస్తోందని ఆయన విమర్శించారు. ఒక వేళ దళితులే ఈ తరహా సంఘటనలకు పాల్పడితే ప్రభుత్వం వారిపై తక్షణం చర్య తీసుకుని ఉండేదన్నారు. దళితులపై అగ్రవర్ణాల హత్యాకాండ, దాడులు పెచ్చుమీ రుతున్నాయని, ఇందుకు లక్ష్మీపేట ఘటన పరాకాష్ట అని ఆయన పేర్కొన్నారు. లక్ష్మీపేట సంఘటన ఇదే మొదటిది, చివరిది కాదని, ఈ తరహా ఘటనలు అనేకం జరిగాయని, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే అవి పునరావృత మవుతున్నాయని రఘునందన్‌ అన్నారు. దళితలకు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి యాక్ట్‌ రక్షణ కవచం లాంటిందని, ఈ యాక్ట్‌ కింద నమోదైన కేసులకు సంబంధించిన విచారణ, దర్యాప్తులను వేగవంతం చేసి సకాలంలో దోషులను శిక్షించడంలో జాప్యం జరగడం వల్ల ప్రయోజమేమిటని ఆయన ప్రశ్నించారు. దళితులపై జరిగిన దాడులు, అన్యాయాలకు సంబంధించి కేసులు నమోదు చేసినంత మాత్రాన వారికి న్యాయం చేకూర్చినట్టు కాదని,సహాయం అందించినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదన్నారు. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం లక్ష్మీపేట ఘటనను తీవ్రంగా పరిగణిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రఘునందన్‌ డిమాండ్‌ చేశారు.
ఎపీసీఎల్‌సీ నేత రఘునాధ్‌