వరద బాధిత ప్రాంతాల్లో సీఎం పర్యటన

హైదరాబాద్‌ : భారీ వర్షాలు, వరదలకు గురైన ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన రక్షణ, సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నేవీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ సహాయాన్ని తీసుకోవాలని అన్నారు. అవసరమైన చోట హెలికాప్టర్‌నూ వినియోగించాలని సీఎస్‌ మిన్నీ మాధ్యూ ఉన్నతాధికారులు, కలెక్టర్‌లను ఆదేశించారు. ఢిల్లీలో ఉన్న సీఎం పలుమార్లు ఫోన్‌చేసి పరిస్థితిని సమీక్షించారు. ముంపునకు గురైన ప్రాంతాలలో వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు నేవీ సహాయంతో లైఫ్‌బోట్లు, అవసరమైతే హెలికాప్టర్‌వాడాలన్నారు. లోతట్టు ప్రాంతాలవారందరినీ సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని, పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి తగు సహాయాన్ని అందించాలని తెలిపారు. వారికి వైద్యచికిత్సలు అందజేయాలని ఆదేశించారు.

వరద ప్రాంతాల్లో నేడు సీఎం పర్యటన : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం వరద ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఆదివారం ఢిల్లీ నుంచి వచ్చాక ఆయన అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. నీటిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూటీమ్‌లు నిరంతరం శ్రమిస్తున్నాయని అధికారులు ఆయనకు వివరించారు.

ముంపు ప్రాంతాల పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. సోమవారం ఉదయం హెలికాప్టర్‌లో సీఎం విజయవాడ వెళతారు. అక్కడి నుంచి ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు.