వాటర్ గ్రిడ్ అవినీతిమయం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకం అవినీతిమయమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక లేకుండా రూ. 45 వేల కోట్ల ప్రాజెక్ట్ ప్రభుత్వం ఎలా చేపడుతోందని ప్రశ్నించారు. అవినీతి, దోపిడి పద్దతుల్లోనే ఈ ప్రాజెక్ట్ టెండర్ల వ్యవహారం సాగుతోందని ఆయన విమర్శించారు. ఈ ప్రాజెక్ట్ కార్పొరేషన్కు కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ చైర్మన్, వైస్ చైర్మన్గా కొనసాగుతూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. టెండర్లకు పిలవలేదని కేసీఆర్ అంటుంటే… రూ. 1700 కోట్లకు టెండర్లకు పిలిచామని కేటీఆర్ చెప్పడమే అవినీతి భాగోతానికి నిదర్శమని ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. ఆంధ్రా కాంట్రాక్టర్లు టెండర్ వేసేందుకు వీలుగా నిబంధనలను మార్చారన్నారు. టీఆర్ఎస్ ఎన్నికల హామీలో లేని వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ను ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని సీఎం కేసీఆర్ను ఈ సందర్భంగా ఉత్తమ్ ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుకు నిధులను ఏ విధంగా సమకూరుస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ ఆరోపిస్తున్నట్లుగా కాంగ్రెస్ నేతలెవరు అవినీతిపరులు కాదన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని తెలంగాణ సీఎం కేసీఆర్కు ఉత్తమ్ కుమార్ హితవు పలికారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్లో ఉన్న అవినీతిని ఏసీబీ వెలికి తీయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు సీఎం కేసీఆర్ అసలు టెండర్లు ఖరారు కాలేదంటూ అబద్దాలు చెబుతున్నారని ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు.



