విడిసిసి రోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్1(జనంసాక్షి):   జిహెచ్ఎంసి పరిధిలో రూ. 158 కోట్ల వ్యయంతో 385 వి డి సి సి రోడ్లను చేపట్టనున్నట్లు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ఎన్.బి.టి నగర్ కమాన్ నుండి  పూర్ని షాప్ మీదుగా జె.ఎన్.ఐ.ఏ.ఎస్ స్కూల్ వరకు, రామాలయం నుండి మైథిలి నగర్ ఎంట్రెన్స్ గేట్, అక్కడ నుండి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 18 వరకు ఒక కోటి 29 లక్షల 63 వేల 296 రూపాయలతో చేపట్టే వి డి సి సి రోడ్డు నిర్మాణానికి మేయర్ గురువారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా  మేయర్ మాట్లాడుతూ… ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ. 158 కోట్ల విలువైన 448 పనులు చేపట్టినట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.101 .60కోట్ల వ్యయంతో 448 పనులను చేపట్టినట్లు మేయర్ ఈ సందర్భంగా అన్నారు. జిహెచ్ఎంసిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. శంకుస్థాపన చేసిన పనులు మూడు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మేయర్ గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఏర్పాటు చేసిన పోర్టబుల్ గణేష్ నిమజ్జన పాండ్ ను పరిశీలించారు. శానిటేషన్ పై దృష్టి పెట్టినట్లు తెలిపారు. నిమజ్జనం సందర్భంగా  వివిధ రకాల మొత్తం 74  కొలనులను   ఏర్పాటు చేసినట్లు మేయర్ వెల్లడించారు. నూతనంగా  24 కృత్రిమ కొలనులను   ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా 22 ప్రదేశాలలో ఎక్స్ వేషన్ (డ్రగ్ పాండ్స్)  కృత్రిమ కొలనుల ను ఏర్పాటు చేశారు. ఇంతకు ముందు శాశ్వతంగా 28 బేబీ పాండ్స్ లను ఏర్పాటు చేసినట్లు  మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు.