విద్యాసంస్థల బంద్‌ విజయవంతం

కడప, జూలై 17 : ప్రైవేట్‌ కళాశాల యాజమాన్యం అధిక ఫీజుల వసూళ్లకు నిరసనగా విద్యార్థి సంఘాలు మంగళవారం జిల్లాలో నిర్వహించిన విద్యాసంస్థల బంద్‌ విజయవంతమైంది. అధిక ఫీజులను అరికట్టాలని ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సమస్యలు మెరుగు పరచాలని ఎఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, పిడిఎస్‌యు విద్యార్థి సంఘాలు జిల్లా విద్యాసంస్థల బంద్‌ నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలను మూసివేయించారు. ఈ సందర్భంగా ఆయా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రైవేట్‌ కళాశాలలు విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో ఫీజులను వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని అరికట్టాలని తాము చేస్తున్న విజ్ఞప్తి పట్ల అధికారులు ఏ విధంగాను స్పందించడం లేదని విమర్శించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. అలాగే ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులను మెరుగుపరచాలని కోరారు. మరుగుదొడ్లు, మంచినీటి వసతితో పాటు ఇతర సౌకర్యాలను మెరుగుపరచాలన్నారు. అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.