విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం.. ఏజిఎం మృతి

విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో ఆ సంస్థ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఒకరు మృతి చెందారు. ఆయన కన్వేయర్ బెల్టులో పడిపోవడంతో మరణించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
మహావిశాఖ నగర పరిధిలోని దేశపాత్రునిపాలెంలో నివాసం ఉంటున్న అరవింద్ మాలవ్య (53) కర్మాగారంలోని సింటర్ ప్లాంట్‌లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఎజిఎం)గా పని చేస్తున్నారు. సింటర్ ప్లాంట్‌లోని ఎస్‌ఎంపిపిలో గురువారం విధులకు హాజరైన ఆయన చిన్న సాంకేతిక లోపం తలెత్తటంతో సరి చేయడానికి వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తూ కాలు జారి కన్వేయర్ బెల్టులో పడిపోయారు.
ఆయన అక్కడి నుండి బర్డెన్ హోపర్ లో పడిపోయారు. సింటర్ మెషిన్ బిల్డింగ్‌లో పవర్ ట్రిప్ అవ్వడంతో దాన్ని సరి చేయడానికి వెళ్లిన ఉద్యోగులకు బర్డెన్ ఫీడర్‌లో మాలవ్య మృతదేహం కనిపించింది. బయటకు తీశారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.