విశాఖ 3టౌన్ పీఎస్‌లో కెసిఆర్‌పై కేసులు: రేవంత్ రెడ్డికి అస్వస్థత

హైదరాబాద్/విశాఖపట్నం: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై విశాఖపట్నం 3టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. న్యాయవాది ఎన్వీవీ ప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కెసిఆర్‌పై కేసులు నమోదు చేశారు.  ఐపిసి 464, 647, 471, 166. 167, 120/బి సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. ఓటుకు నోటు వ్యవహారంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిష్టను దిగజార్చేందుకు కెసిఆర్ కుట్ర చేస్తున్నారని న్యాయవాది తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మూడో రోజు కస్టడీలో రేవంత్ రెడ్డి: అస్వస్థతతో ఆస్పత్రికి హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో అరెస్టయి ఏసిబి కస్టడీలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహాకు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డితోపాటు మిగిలిన ఇద్దరిని శని, ఆదివారాల్లో ఏసిబి అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపారు. వారు కొంత అస్వస్థతకు గురైనట్లు గుర్తించడంతో సోమవారం ఉదయం ఉస్మానియాకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు కాగా, మూడో రోజు రేవంత్‌రెడ్డిని ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. రేవంత్‌ను సోమవారం కాల్‌డేటాపై ప్రశ్నించనున్నారు. రెండు రోజుల విచారణలో రేవంత్, సెబాస్టియన్, ఉదయ్‌సింహా నుంచి ఏసీబీ అధికారులు కీలక సమాచారం సేకరించిన విషయం విదితమే. ఆదివారం రాత్రి చంద్రబాబు, స్టీఫెన్ సన్ ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో టేపులు బహిర్గతమైన విషయం తెలిసిందే. సోమవారం రేవంత్ నుంచి ఏసీబీ మరింత సమాచారం సేకరించనుంది. చంద్రబాబుకు ఏ క్షణమైనా ఏసీబీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. కాగా, రేవంత్ బెయిల్‌పై ఏసిబి కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనుంది.