వేములవాడ ఎమ్మెల్యేపై స్పీకర్‌కు ‘పొన్నం’ ఫిర్యాదు

హైదరాబాద్‌ :  వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్‌ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు పొన్నం ప్రభాకర్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన శాసనసభలో స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. వేములవాడ ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి రమేశ్‌ స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండకుండా జర్మనీలో ఉంటున్నారని, ప్రొఫెసర్‌గా పనిచేస్తూ  అక్కడా, ఎమ్మెల్యేగా ఇక్కడా జీతభత్యాలు పొందున్నారని పొన్నం ఆరోపించారు. రెండు చోట జీతభత్యాలు తీసుకుంటున్న రమేశ్‌ను అనర్హుడిగా ప్రకటించాలని, అంతేకాకుండా ఇప్పటి వరకు ఆయన తీసుకున్న జీతభత్యాలను రికవరీ చేయాలని ప్రభాకర్‌ కోరారు. జర్మనీలో ఉండటం వల్ల వేములవాడ నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావడమే కాకుండా నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడుతోందని పేర్కొన్నారు. ఆ నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే తన అనుచరుల ద్వారా అడ్డుకుంటున్నారని, బీసీ ఎంపీ అయిన తనపై కూడా ఎమ్మెల్యే అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని ప్రభాకర్‌ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.