వైఎస్‌ఆర్‌ సిపిలోకి చేరుతున్న ఇతర పార్టీ కార్యకర్తలు

కరీంనగర్‌, అక్టోబర్‌ 29 : జూలపల్లి మండలంలోని వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు వైఎస్‌ఆర్‌ సిపిలో చేరుతున్నట్లు ఆ పార్టీ జిల్లా నేతలు ఎ.రమేష్‌, మధు పేర్కొన్నారు. రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ సిపికి ఆదరణ పెరగడాన్ని చూసి ఓర్వలేకపోతున్నాయని అన్నారు. వైఎస్‌ఆర్‌ సిపి అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిని  జైలు నుంచి విడుదల చేయకుండా టిడిపి, కాంగ్రెస్‌ పార్టీలు ఏకమై అడ్డుకుంటున్నారని వారు విమర్శించారు. జగన్‌పై అనేక అక్రమ కేసులు బనాయించి, ప్రభుత్వంతో తెలుగుదేశం పార్టీ చేతులు కలిపిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ను బయటకు రాకుండా ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఇది వారికి తగదని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ సిపి అధిక సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమని మధు అన్నారు. ప్రజల సమస్యలను పూర్తిగా తెలుసుకునేందుకు, ప్రజల సమస్యలను అవగాహన చేసుకునేందుకు షర్మిళ పాదయాత్ర చేపడుతున్నారని అన్నారు. ఆమె ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ, ఆమె బహిరంగ సభల్లో పాల్గొని విజయవంతం చేస్తున్నారన్నారు.