వైద్యుల సమ్మె సక్సెస్‌

విజయనగరం, జూన్‌ 25 : కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ)ఆధ్వర్యంలో సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలో వైద్యులు నిర్వహించిన నిరసన ధర్నా విజయవంతమైంది. జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల నుంచి వైద్యులు పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి బాలాజీ జంక్షన్‌ మీదుగా కోటజంక్షన్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కోటజంక్షన్‌ వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఐఎంఎ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ ప్రసాద్‌ మట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ నిరంకుశ నిర్ణయం వల్ల వైద్యుల హక్కులు కాలరాసే ప్రమాదం ఏర్పడిందన్నారు. అంతేకాకుండా ప్రజారోగ్యం నిర్వీర్యం అయ్యే పరిస్థితి నెలకొందన్నారు. కేంద్ర మంత్రి ఆజాద్‌ ఏకపక్ష నిరంకుశ నిర్ణయాలను వెంటనే రద్దు చేసి మంత్రి పదవికి ఆజాద్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న చిన్నా చితక ఆసుపత్రులకు రక్షణ కల్పించాలన్నారు. బిహెచ్‌ఆర్‌సి కోర్సును వెంటనే రద్దు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల వలన పేదలకు వైద్యం అందే పరిస్థితి లేదని, అందుకే వైద్యులు అంతా ఈ రోజు దేశ వ్యాప్త సమ్మెను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎంఎ జిల్లా శాఖ అధ్యక్షులు జెసి నాయుడు, ప్రతినిధులు శ్రీనివాసరావు, తిరుమల ప్రసాద్‌, సురేష్‌తో పాటు పలువురు వైద్యులు, నర్సింగ్‌ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.