వ్యవసాయశాఖ జెడి కార్యాలయంలో ఎమ్మెల్యే నిరసన

అధికారుల తీరుపై మండిపాటుతో వివాదం
ఏలూరు, జూలై 21 : పశ్చిమ గోదావరి జిల్లాలో ఎరువుల కొరత, డీలర్ల బ్లాక్‌ మార్కెటింగ్‌పై అధికార పార్టీకి చెందిన చింతలపూడి ఎమ్మెల్యే మద్ధాల రాజేష్‌ కుమార్‌ శనివారం సాయంత్రం ఏలూరులో ఆందోళనకు దిగారు. చింతలపూడి ప్రాంతానికి చెందిన రైతులతో కలసి వ్యవసాయశాఖ జిల్లా జాయింట్‌ డైరెక్టర్‌ కార్యాలయానికి వచ్చిన రాజేష్‌, సూపర్‌ ఫాస్పేట్‌ ఎరువుల బస్తాను వెంట తెచ్చి వ్యవసాయశాఖ అధికారులకు అందజేశారు. మెట్టప్రాంతంలో సూపర్‌ ఫాస్పేట్‌ ఎరువులు అందనందున రైతుల ఇబ్బందులను ఈ విధంగా ఈ రూపంలో మీకు నిరసన తెలుపుతున్నామని అన్నారు. అధికారుల అలసత్వం వలనే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంత చేసినా అధికారుల వల్ల ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. ఫాస్పేట్‌, డిఎపి యూరియా ఎరువులు బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్నారని దీని వలన ఆర్థికంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని అసహనం వ్యక్తంచేశారు. దీనితో వివాదం తలెత్తింది. పరిస్థితి తెలుసుకున్న ఇన్‌ఛార్జ్‌ జాయింట్‌ కలెక్టర్‌ శేషగిరి బాబు పరిస్థితిని సరిదిద్దే ప్రయత్నం చేశారు. డీలర్ల వద్దనున్న ఎరువులను పాత ధరకు విక్రయించే చర్యలు తీసుకుంటామని, 234 సొసైటీల ద్వారా ఎరువులు నిర్ణీత ధరకు విక్రయించే చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే రాజేష్‌ శాంతించారు.