వ్యవసాయ బోర్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వండి
కడప, జూలై 30: జిల్లాలో వ్యవసాయ బోర్లకు తక్షణమే విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని జిల్లా కలెక్టరు వి అనిల్ కుమార్ విద్యుత్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో డయల్ యువర్ కలెక్టరు, ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ రైతులు తమ పొలాలను వ్యవసాయ బోర్లు వేసుకున్న కనెక్షన్ ఇవ్వలేదని డయల్ యువర్ కలెక్టరుకు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రామాపురం మండలం హసనాపురం గ్రామానికి చెందిన ఖాసిం తమ పొలానికి బోరు, విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయాలని కోరారు. బద్వేల్ పట్టణానికి చెందిన ప్రసాదు సిద్ధపటం రోడ్లులో పశుపక్షాదులకు చెందిన వ్యర్థపదార్ధాలను రోడ్డు మీదనే వేస్తున్నారని, దాని వలన దుర్వాసన వస్తుందని కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. జిల్లా పరిషత్ సర్కిల్ నుంచి ఐటిఐ సర్కిల్ వరుకు వీధి లైట్లు వేయించాలని కడప పట్టణానికి చెందిన వెంకట్‌కలెక్టరుకు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ స్పందిస్తు సంబంధిత అధికారులను పిలిచి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో కలసపాడు మండలం, బలిజపల్లె గ్రామానికి చెందిన శ్రీనివాసులు తాము సహకార బ్యాంకులో ఋణాలు తీసుకున్నామని ఆ ఋణాలను అప్పటి ముఖ్యమంత్రి మాఫీ చేశారని, అయిన బ్యాంకు వారు ఋణ బాకీ ఇంకా వున్నదని దాని వలన పాస్ బుక్కులు ఇవ్వడం లేదని తమకు పాస్ బుక్కులిప్పించాలని విజ్ఞప్తి చేశారు. చిన్నమండెం మండలం కొత్తపల్లె గ్రామానికి చెందిన శ్రీనివాసులు, శ్రీరామకాలని ప్రాథమిక పాఠశాలలో 31 మంది బాలబాలికలు చదువుకుంటున్నారని ఆ పాఠశాలకు నీటి వసతి కల్పించాలని కలెక్టరును కోరారు. కలెక్టరు స్పందించి గ్రామీణ నీటి సరఫరా యస్‌ఇని తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పుల్లపేట మండలం అనంతయ్య గారి పల్లెకు చెందిన వెంకటయ్య, నరసింహులు, తమ పొలానికి వెళ్లేందుకు దారి ఏర్పాటు తీసుకోవాలన్నారు. అలాగే కుంటలలోని మట్టిని తోలేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. చిన్నమండెం మండలం మల్లూరు గ్రామానికి చెందిన బాబాపల్లి సర్వే నెంబర్ 181/3లో 1-55 సెంట్ల భూమి తన తాతగారి చెల్లెలు బేబి అక్రమంగా పట్టా చేయించుకున్నారని తమకు న్యాయం చేయాలని కోరారు. చక్రాయపేటకు చెందిన చెన్నయ్య గ్రామంలో జూనియర్ కాలేజి, హైస్కూల్ కలిసి వున్నాయని వాటి వల్ల ఇబ్బంది వుందని కోరారు. అనంతరం వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 5ట్రైసైకిళ్ళను వికలాంగులకు కలెక్టరు పంపిణి చేశారు. అనంతరం వికలాంగులను సకలాంగులు వివాహము చేసుకున్నందున 10 జంటలకు ఒక్కొక్కరికి 10వేల రూపాయలను కలెక్టరు దంపతులకు అందచేశారు. ఈ సమావేశంలో అనపు జాయింట్ కలెక్టరు జోషిబాబు, ఇన్‌చార్జి జాయింట్ కలెక్టరు హేమసాగర్ డిఆర్డి ఏ పిడి గోపాల్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.