శ్రీలంక విజయం సాధించి సెమీస్‌కు చేరిక

క్యాండీ: పల్లేకల ఇంటర్నేషన్‌ స్టేడియంలో టి20 ప్రపంచకప్‌ గ్రూప్‌-1 విభాగంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీస్‌కు చేరుకుంది. టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఐదు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. వెస్టిండీస్‌ బ్యాట్స్‌మెన్లలో అత్యధికంగా శామ్యూల్స్‌ 50, బ్రేవో 40 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో అత్యధికంగా అజంతా మెండీన్‌ 2 వికెట్లు తీయగా మాథ్యూన్‌, కులశేఖర, జీవన్‌ మెండీన్‌లు ఒక్కో వికెట్‌ తీసుకున్నారు. అనంతరం 130 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన లంక 22 పరుగుల వద్ద దిల్షాన్‌ (13) రూపంలో తొలివికెట్‌ కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన సంగక్కర ఓపెనర్‌ జయవర్థనేతో కలిసి స్కోర్‌ బోర్డును నిలకడగా ముందుకు తీసుకెళ్లారు. వీరి జోడీ 13 ఓవర్లలో స్కోర్‌ను 100 దాటించింది. అదే ఉపులో జయవర్థనే 45 బంతుల్లో ఎనిమిది ఫోర్లతో 50 అర్ధశతకాన్ని పూర్తిచేశాడు. 39 పరుగులతో కుమార సంగక్కర అతనికి అండగా నిలిచాడు. జయవర్ధనే 65 పరుగులతో అజేయంగా నిలిచాడు. 15.2 ఓవర్లలో మ్యాచ్‌ను ముగించడం విశేషం. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ 13 అదనపు పరుగులు సమర్పించుకుంది. వెస్టిండీస్‌ బౌలర్లలో రాంపాల్‌ ఒక్కడే ఒక వికెట్‌ తీసుకున్నారు.