శ్వేతపత్రం విడుదల చేయాలి : శోభానాగిరెడ్డి

హైదరాబాద్‌ :రాష్ట్రంలో విధ్యుత్‌ సమస్యపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ ఛార్జీల పెంపు, కరెంట్‌ కోతలకు నిరసనగా వారు నల్ల బ్యాడ్జీలు ధరించి బుధవారం అసెంబ్లీకి హాజరయ్యారు. అంతకు ముందు ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి మాట్లాడుతూ ఛర్జీల పేరిట ప్రభుత్వం రూ.35 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపారన్నారు. లక్షల ఎకరాల పంట ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆమె మండిపడ్డారు. ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
తెలుగుదేశం పార్టీ సహకారంతో సభను నడపకుండా ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని శోభా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. విద్యుత్‌ సంక్షోభంతో పారిశ్రామిక రంగాలు కుదేలు అయ్యాయని, వైఎస్‌ఆర్‌ సీఎంగా ఉన్న అయిదేళ్లలో విద్యుత్‌ ఛార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచలేదని గుర్తు చేశారు. రైతులకు ఏడు గంటలపాటు ఉచిత విద్యుత్‌ అందించారని ఆమె అన్నారు.