షిండే వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రతిపక్షాలు

న్యూఢిల్లీ: బోఫోర్స్‌ వ్వవహారం వలె బొగ్గు కుంభకోణం కూడా ప్రజల నుంచి మాయమవుతుందన్న కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఘాటుగా స్పందించాయి. కుంభకోణం వెలుగుచూసిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అధికారాన్ని కోల్పోయిందని, అప్పట్నుంచి ఇప్పటివరకు ఏనాడు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు అవసరమైన మెజారిటీని సంపాదించలేదని పేర్కొన్నాయి. ప్రజలు బోఫోర్స్‌ను గుర్తుంచుకున్నారా లేదా అనేది వేరే విషయం. కానీ బోఫోర్స్‌ వల్ల కాంగ్రెస్‌కు ఏం జరిగిందనేది ఆ పార్టీ మరచిపోయింది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి అవసరమైన మెజారిటీని కాంగ్రెస్‌ సంపాదించలేకపోయింది అని భాజపా నేత బాల్బీర్‌పంజ్‌ వ్యాఖ్యానించారు. శనివారం పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో షిండే మాట్లాడుతూ గతంలో బోఫోర్స్‌ ప్రజల్లో నానేది. ఇప్పుడు దాన్ని మరిచిపోయారు. ప్రస్తుతం బొగ్గు కుంభకోణంపై మాట్లాడుకుంటున్నారు. త్వరలేనే దీన్ని మరిచిపోతారు అని వ్యాఖ్యానించారు. షిండేను ఆయన వ్యాఖ్యలపై విలేకరులు వివరణ కోరగా ఎన్డీఏ హయాంలోని పెట్రోల్‌ పంపుల కుంభకోణం మీకు గుర్తుందా అని ప్రశ్నించారు.