సడక్‌ బంద్‌ చేసి తీరతం..ఆపే శక్తి ఎవరికీ లేదు

సీఎం వ్యాఖ్యలతోనే పౌరుషం : కోదండ
తాటాకు చప్పుళ్లకు బెదరం : ఈటెల
పర్కారుదే బాధ్యత : హరీశ్‌
హైదరాబాద్‌ : ”సడక్‌ బంద్‌ను చేసి తీరతాం. దీనిని ఆపే శక్తి ఎవరికీ లేదు” అని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ తేల్చి చెప్పారు. ఇటు హైదరాబాద్‌లో, అటు మహబూబ్‌నగర్‌లో తెలంగాణ జేఏసీ నేతలు మంగళవారం సడక్‌బంద్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోదండరామ్‌ మాట్లాడుతూ.. అనివార్య పరిస్థితుల్లోనే సడక్‌ బంద్‌ చేపడుతున్నామని, దీనిని ఏ శక్తీ అడ్డుకోలేదని చెప్పారు. ఎన్ని ఎత్తులు వేసినా పోలీసు వలయాన్ని చేదించుకుని తెలంగాణ కావాలనుకునే ప్రతి ఒక్కరూ రోడ్డుపైకి రావాలని, పావురాలన్నీ కలిసి వలను ఎత్తుకెళ్లిన మాదిరిగా పోలీసు వలయాన్ని చేదించుకుని వెళ్లాలని పిలుపునిచ్చారు.
తెలంగాణకు పైసా ఇవ్వను… ఏం చేసుకుంటారో చేసుకోండని సీఎం కిరణ్‌ అనడంతో తెలంగాణవాసులతోపాటు దేశ విదేశాల్లోని తెలంగాణ ప్రజలకు పౌరుషం పెరిగిందని, సడక్‌బంద్‌ పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తామని చెప్పారు. సడక్‌ బంద్‌ నేపథ్యంలో 21 హైదరాబాద్‌ – కర్నూలు ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు.
సడక్‌ బంద్‌ ఏడు కేంద్రాల్లో జరుగుతుందని, శంషాబాద్‌లో దేవీప్రసాదరావు, కత్తి వెంకటస్వామి, తిమ్మాపూర్‌ వద్ద శ్రీధర్‌, చలమారెడ్డి, షాద్‌నగర్‌ వద్ద విఠల్‌, లక్షయ్య, జడ్చర్లవద్ద వెంకటేశం, ప్రహ్లాద్‌, భూత్పూర్‌ వద్ద రవీందర్‌రెడ్డి, రఘు, మణిపాల్‌రెడ్డి, కొత్తకోట వద్ద అశ్వత్థామ రెడ్డి, అలంపూర్‌ వద్ద కోదండరామ్‌, శ్రీనివాస్‌గౌడ్‌,రసమయి బాలకిషన్‌, అద్దంకి దయాకర్‌ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.
సడక్‌ బంద్‌ను అడ్డుకునేందుకు పాలక పక్షం ప్రయత్నిస్తుంటే ప్రధాన ప్రతపక్షం స్పందించకపోవడం విచారకరమని ఉద్యోగ సంఘాల జేఏసీ నేత శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు. సడక్‌ బంద్‌ను చేసి తీరతామని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాంజేందర్‌ స్పష్టం చేశారు.
సడక్‌ బంద్‌ పేరుతో విధ్వంసానికి దిగే ఉద్దేశం తమకు లేదని, టీఆర్‌ఎస్‌ఎల్సీ ఉపనేత హరీశ్‌రావు తెలంగాణ భవన్‌లో చెప్పారు. రెచ్చగొడితే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. .రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో మంగళవారం ఆయన ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించే బైక్‌ ర్యాలీని ప్రారంభించారు.
తెలంగాణలోని అన్నివర్గాల ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్నామని స్వామిగౌడ్‌ చెప్పారు. రాష్ట్రంలో 2014లో జరగనున్నది పాండవులు, కౌరవుల మధ్య యుద్ధమని, అందులో గెలిచేది ధర్మ, న్యాయమేనని టీఆర్‌ఎస్‌ ఎమ్మేల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
నిజాం కాలేజీలో టీఆర్‌ఎస్వీ గ్రేటర్‌ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సడక్‌ బంద్‌ సన్నాహాక కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సడక్‌ బంద్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక హెచ్చరిక అనిక బీజేపీ నేత సీహెచ్‌ విద్యాసాగర్‌రావు మహబూబ్‌నగర్‌లోని తమ పార్టీ కార్యాలయంలో విలేకరులకు చెప్పారు.