సదానందంను భేషరతుగా విడుదల చేయాలి – అక్రమ అరెస్టును ఖండించిన పలు పార్టీలు ప్రజాసంఘాలు…
కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) జూలై 27 :–. హైదరాబాద్, ఉప్పల్ లోని సిపిఐ(ఎం.ఎల్) రెవల్యూషనరీ ఇనిషియేటివ్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గడ్డం సదానందంను తన నివాస ప్రాంతం నుండి గురువారం తెల్లవారుజామున హన్మకొండలోని సుబేదార్ స్టేషన్ పోలీసులమని చెప్పి, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని బలవంతంగా కారులో తీసుకొని వెళ్ళినట్లు అతని భార్య జమున తెలియజేసిన నేపథ్యంలో అతడికి ఎలాంటి హాని తలపెట్టకుండా భేషరతుగా విడుదలచేయాలని లేదా కోర్టులో హాజరుపరచాలని ఓ.పి.డి.ఆర్. జాతీయ అధ్యక్షులు చిగురుపాటి భాస్కరరావు, రాష్ట్ర అధ్యక్షురాలు, లక్ష్మీదేవి, సిపిఐ(ఎం.ఎల్) ప్రతిఘటన కేంద్ర కమిటీ కార్యదర్శి షేక్ షావలి, సిపిఐ(ఎం.ఎల్) క్రాంతి జాతీయ కార్యదర్శి మల్లెపల్లి ప్రభాకర్, సిపిఐ(ఎం.ఎల్) రాంచంద్రన్ అధికార ప్రతినిధి బుద్ద సత్యనారాయణ, తెలంగాణ వికలాంగుల ఐక్య వేదిక మబ్బు బాలు, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఎం.డి.పాషామియా, పీఓడభ్ల్యూ(విముక్తి) ఎం. పుణ్యవతి, ఇఫ్టూ సుందర్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారంరోజున ప్రజాసంఘాలు, విప్లవ సంస్థలు పంపిన సంయుక్త పత్రిక ప్రకటనలో కుటుంబ సభ్యులకు ఎలాంటి కారణాలు చూపకుండా, కనీసం తమ అదుపులోకి తీసుకున్నామని రసీదు ద్వారానైన వ్రాసి ఇవ్వాలని అన్నారు. గుర్తుతెలియని వ్యక్తుల రూపంలో వచ్చినవారు నిజంగా వచ్చినవారు పోలీసులేనా? లేక పోలీసుల పేరుచెప్పి, సదానందంను కిడ్నాప్ చేశారా? అనుమానం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. సదానందాన్ని అక్రమ నిర్భందానికి గురిచేసిన తెలంగాణ బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వ అప్రజాస్వామికమైన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు. 2021 సంవత్సరం మే నెలలో వరంగల్ జిల్లా హన్మకొండ , సుబేదారి పోలీస్ స్టేషన్ లో గడ్డం సదానందం, మరో ముగ్గురిపై సిపిఐ(మావోయిస్టు )పార్టీతో సంబంధం ఉందని అబద్ధపు ఆరోపణ చేసి ఉపా క్రింద కేసు పెట్టారని ప్రకటనలోతెలియజేశారు. కానీ రెండు సంవత్సరాల తర్వాత ఇలా ఎవరో? వచ్చి, హన్మకొండ, సుభేదారి పోలీసులమని మాత్రం చెప్పి, తీసుకెళ్ళడం వెనుక పలు అనుమానాలు ఉన్ననేపథ్యంలో వెంటనే తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు స్పందించాలని కోరారు. ప్రజల పక్షాన, ప్రజాస్వామికంగా నిలబడి పోరాడుతున్న ఉద్యమ సంస్థల నాయకులు, కార్యక్తల పట్ల ఇలాంటి అనైతిక , అప్రజాస్వామిక, ప్రజావ్యతిరేఖ విధానాలతో పౌర ప్రజాస్వామిక హక్కులను కాలరాయడం పాలకులకు తగదని సూచించారు. 2021 లో గడ్డం సదానందంతోపాటు ఇతర ప్రజా ఉద్యమ నాయకులు, కార్యకర్తలు, మేదావులు, ప్రజాస్వామిక వాదులపై పెట్టిన ఉపాతో పాటు అన్నిరకాల తప్పడు కేసులను ఎత్తివేసేలా తగిన చొరవను బీఆర్ఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. సదానందం అక్రమ అరెస్టును ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఖండించాలని కోరారు.