సబర్మతి జైల్లో 18 అడుగుల సొరంగం

అహ్మదాబాద్‌ : అహ్మదాబాద్‌లోని సబర్మతీ జైలులో అధికారులు, 4 అడుగుల వెడల్పు 18 అడుగుల పొడవైన సొరంగాన్ని కనిపెట్టారు. జైలులోని 14 మంది ఈ సొరంగం తవ్వినట్లు అధికారులు గుర్తించారు. వారంతా 2008లో 50 మంది మృతికి కారణమైన వరుస బాంబు పేలుళ్ల కేసులో నేరస్తులు. నేరస్తుల్లో కొందరు సివిల్‌ ఇంజనీర్లున్నారని వారు తమకు భోజనానికి ఇచ్చిన ప్లేట్లు, గిన్నెల్లాంటి వాటితో సొరంగం తవ్వారని అధికారులు అంటున్నారు రోజూ మూడు గంటలపాటు ఈ నేరస్తులకు వారి గదుల వద్ద తోటపని చేసుకోవడానికి అనుమతి ఉంది. ఆ సమయాన్ని వారు సొరంగం తవ్వడానికి వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. సొరంగం కోసం తవ్విన మట్టిని తోటలో పోసినట్లు అధికారులు కనిపెట్టారు. ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. సబర్మతీ జైలులో 3700 మంది ఖైదీలు ఉన్నారు.

తాజావార్తలు