సమన్లు అందలేదు : తమిళనాడు గవర్నర్‌ రోశయ్య

చెన్నై : ఏసీబీ కోర్టు నుంచి తనకు ఎలాంటి నోటీసులు కానీ సమన్లు కానీ అందలేదనితమిళనాడు రాష్ట్ర గవర్నర్‌ కె.రోశయ్య స్పష్టం చేశారు. తనకు ఒక వేళ నోటీసులు అందింతే వాటిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని, అప్పుడే తగిన రీతిలో స్పందిస్తామని ఆయన బుధవారంనాడు అన్నారు. హైదరాబాద్‌ లోని అమీర్‌పేట్‌ ప్రాంతంలో గల భూముల కేటాయింపుకు సంబంధించి ఆయనపై ఒక న్యాయవాది గతంలో ఎసిబి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న రోశయ్య తన హోదాను దుర్వినియోగం చేస్తూ భూ కేటాయింపులు జరిపారని పిటిషన్‌దారుడు ఆరోపించారు. దీనిపై అప్పట్లోనే ఎసిబి విచారణ జరిపి రోశయ్యకు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. అయినప్పటికీ తాజాగా ఈ విషయమై ఆయనకు నోటీసులు జారీ చేయడం పలువురిని విస్మయపరిచింది. రాజ్యంగ బద్ధమైన పదవులు నిర్వహిస్తున్న గవర్నర్‌కు కోర్టులు నోటీసులు, సమన్లు జారీ చేయజాలవని రాజ్యంగ, న్యాయనిపుణులు అభిప్రాయ పడుతున్నారు.