సామాన్యుడికి…200 ఎకరాల ఆసామికి పోటీ


ఎకరం కూడా లేని ఉద్యమ నాయకుడు గెల్లు
మలిదశ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన యువనేత
ఓటమి భయంతో ఈటెల మాటలు పేలుతున్నారు
ప్రజాశీర్వాద సభలో మంత్రి హరీష్‌ రావు
హుజూరాబాద్‌,అగస్టు11(జనం సాక్షి): త్వరలో జరగబోయే హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో రెండు గుంట భూమి ఉన్న సామాన్యుడి, 200 ఎకరాల ఆసామి మధ్యనే పోటీ ఉంటుందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఎకరం అమ్మి ఎన్నికల్లో గెలుస్తానన్న ఈటలకు మద్దతు తెలుపుతారో.. ఎకరం కూడా లేని ఉద్యమ నాయకుడికి ఓటు వేసి అభివృద్ధికి తోడ్పాటును అందిస్తారో ప్రజలే తేల్చాలన్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గం ఇల్లందకుంటలో ఏర్పాటు చేసిన ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌కు మద్దతుగా ప్రసంగించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో శ్రీనివాస్‌ యాదవ్‌ చురుకైన పాత్ర పోషించి.. రాష్ట్ర సాధనకు కృషి చేశారని కొనియాడారు. ఉద్యమంలో భాగంగా అనేకసార్లు జైలుకు వెళ్లివచ్చారని గుర్తు చేశారు. గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌కు కేసీఆర్‌తో పాటు తామంతా అండగా ఉంటామని తేల్చిచెప్పారు. హుజూరాబాద్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని, టీఆర్‌ఎస్‌ పార్టీని ఆశీర్వదించాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. ఓటమి భయంతోనే ఈటల రాజేందర్‌ పరుష పదజాలం ఉపయోగిస్తున్నారని మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. బీజేపీలోకి వెళ్లిన ఈటల రాజేందర్‌ కొత్త భాష నేర్చుకుని, తండ్రి లాంటి కేసీఆర్‌ను రా అని సంబోధిస్తున్నారు. తనను ఓరేయ్‌ హరీశ్‌ అని వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయ ఓనమాలు నేర్పి, ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి, రెండుసార్లు మంత్రి పదవి ఇచ్చిన కేసీఆర్‌ను అలా సంబోధించడం సరైంది కాదన్నారు. ఈటల ఎలాంటి పదజాలం వాడినా.. తాము మాత్రం రాజేందర్‌ను గౌరవంగా పిలుస్తామని తెలిపారు. ఓటమి భయంతోనే మాటలు తూలుతు న్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ గెలుపు ఖాయమైందని అన్నారు. ఈటల తల్లిలాంటి పార్టీని గుండెలవిూద తన్నారన్నారు. ఈటల గులాబీ జెండాను మోసం చేశారన్నారు. హుజూరాబాద్‌లో ఈటల ఒక్క ఇల్లు కూడా కట్టించలేదన్నారు. దత్తత గ్రామం సిరిసేడులోనూ ఏ ఒక్క పనిచేయలేదన్నారు. మంత్రిగా పనిచేయని ఈటల ఇప్పుడేం చేస్తారో చెప్పాలన్నారు. రైతుబంధు కింద ఈటల రూ.10 లక్షలు తీసుకున్నారు. ఇప్పుడేమో రైతుబంధు వద్దంటున్నడు. ఈటలకు ఓటమి భయం పట్టుకుంది. అసహనంతో మాట్లాడుతున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. కరీంనగర్‌ ఎంపీగా బండి సంజయ్‌ ఏమైనా అభివృద్ధి చేశారా? రూ.10 లక్షల పని కూడా చేయలేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపుతోందన్నారు. బీజేపీ పాలనలో పెట్రోల్‌ ధర.రూ.105కు చేరిందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కళ్లముందే కనిపిస్తుందని మంత్రి హరీశ్‌ అన్నారు. కాళేశ్వరం వచ్చాక మండుటెండల్లో కూడా నీరు పారిందన్నారు. కాళేశ్వరం తొలిఫలితం హుజూరాబాద్‌ ప్రజలకే దక్కిందన్నారు. రూ.10 కోట్లతో ఇల్లందకుంట రామాలయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. హుజూరాబాద్‌లో అభివృద్ధి కొనసాగాలో.. నియోజకవర్గంలోని 2.29 లక్షల మందికి లాభం జరగాలో ఆలోచించాలని కోరారు. నియోజకవర్గానికి ప్రభుత్వం కేటాయించిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను ఈటల రాజేందర్‌ కట్టియ్యలేదన్నారు. హుజూరాబాద్‌కు 4 వేల ఇండ్లు మంజూరైతే ఈటల పట్టించుకోలేదన్నారు. హుజూరాబాద్‌లో 4 వేల డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కట్టించే బాధ్యత తనదన్నారు. సీఎం కేసీఆర్‌ మాట తప్పని నాయకుడని మంత్రి హరీశ్‌ పేర్కొన్నారు. సభలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ సాధన తర్వాత కరెంట్‌ సమస్య తీరిందన్నారు. ఆడబిడ్డలకు తాగునీటి సమస్యలు తీర్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని కొనియాడారు. కల్యాణలక్ష్మితో పేదింటి ఆడబిడ్డలను ఆదుకుంటున్నట్లు
చెప్పారు. కేసీఆర్‌ కిట్‌తో మహిళలు సంతోషంగా ఉన్నారన్నారు. తెలంగాణలో ఉన్న పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ రాష్ట్ర సర్వోతోముఖాభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ త్వరలో జరగబోయే ఉప ఎన్నికలో తనకు పోటీ చేసే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు శ్రీనివాస్‌ యాదవ్‌ పాదాభివందనాలు తెలిపారు. తనను గెలిపించాలని హరీశ్‌ రావుకు పార్టీ నాయకత్వం బాధ్యతలు అప్పగించారు. పేద కుటుంబం నుంచి వచ్చిన తనకు అవకాశం ఇచ్చారు. విద్యార్థి నేతగా ఉద్యమాల్లో పాల్గొన్నాను. దళిత, బహుజన విద్యార్థుల హక్కుల కోసం పోరాడాను. పార్టీ కోసం తాను చేసిన సేవలు గుర్తించి సీఎం కేసీఆర్‌ తనకు అవకాశం ఇచ్చారు. తనను గెలిపిస్తే విూ పని మనిషిలా సేవ చేసుకుంటానని గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండా శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ నేత కౌశిక్‌ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.