పసికందుకు సరిపడా పాలు లేని తల్లులు

జనం సాక్షి నవంబర్6శిశువులకు తల్లిపాలు ఎంతో అవసరం అన్న విషయం అందరికీ తెలిసిందే. చిన్నారులకు తల్లిపాలను తాగించడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. భూమిపై ఏ ఆహారంలోనూ లేని పోషకాలు తల్లిపాలలో లభిస్తాయని పోషకాహార నిపుణులు, వైద్యులు చెబుతుంటారు. అందుకనే తల్లులు కచ్చితంగా పిల్లలకు పాలు ఇవ్వాలని సూచిస్తుంటారు. పిల్లలకు తల్లిపాలు లభించడం వల్ల వారిలో ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. పోషకాలు సరిగ్గా లభిస్తాయి. వారు చురుగ్గా ఉంటారు. ప్రతిభావంతులుగా మారుతారు. తెలివితేటలు పెరుగుతాయి. జన్యు సంబంధమైన లేదా వంశపారంపర్య వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కనుక పసికందులకు కచ్చితంగా తల్లిపాలను ఇవ్వాల్సి ఉంటుంది. అయితే కొందరు తల్లుల్లో పాలు సరిగ్గా ఉత్పత్తి కావు. అలాంటి వారు కొన్ని చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.
మెంతులు, మునక్కాయలు..
ఒక కప్పు నీటిలో ఒక టీస్పూన్ మెంతులను వేసి బాగా మరిగించాలి. అనంతరం ఆ నీటిని వడకట్టి అందులో ఒక టీస్పూన్ తేనెను కలిపి తాగాలి. ఇలా రోజుకు మూడు సార్లు తాగితే తల్లుల్లో పాలు ఉత్పత్తి అవుతాయి. మెంతుల్లో ఉండే ఫైటోఈస్ట్రోజన్ పాలను ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల పాలు రావడం లేదని బెంగ పడాల్సిన అవసరం ఉండదు. అలాగే మునక్కాయలు కూడా ఈ సమస్య నుంచి బయట పడేలా చేస్తాయి. మునక్కాయలను తీసుకుని వాటిపై ఉండే పొట్టు తీసి అనంతరం వాటిని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. తరువాత వాటిని మిక్సీలో వేసి బాగా పట్టుకోవాలి. అనంతరం వడకట్టి రసం తీయాలి. దాన్ని అర కప్పు మోతాదులో తాగాలి. ఇలా రోజుకు ఒకసారి తాగుతుంటే ఫలితం ఉంటుంది. పాలు బాగా వృద్ధి చెందుతాయి.
సోంపు గింజలు, వెల్లుల్లి..
సోంపు గింజలను వాడుతున్నా కూడా బాలింతలు ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. ఇందుకు గాను ఒక పాత్రలో కొన్ని నీటిని తీసుకుని అందులో కొన్ని సోంపు గింజలు వేసి బాగా మరిగించాలి. అనంతరం ఆ నీటిని వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఇలా రోజుకు 2-3 సార్లు చేయాలి. దీని వల్ల కూడా పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. అలాగే రోజూ వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకున్నా ఉపయోగం ఉంటుంది. వెల్లుల్లిలో లాక్టోజెనిక్ గుణాలు ఉంటాయి. అందువల్ల దీన్ని తింటే బాలింతల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలను కాస్త దంచి తినాలి. లేదా అందులో కాస్త తేనె కలిపి తినవచ్చు. వెల్లుల్లి రసం తాగుతున్నా ఉపయోగం ఉంటుంది. దీని వల్ల కూడా బాలింతల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది.
దాల్చిన చెక్క, బాదంపప్పు..
పాలు రాని తల్లులు లేదా పాలు సరిపోను లేని వారు దాల్చిన చెక్కను తీసుకుంటున్నా ఉపయోగం ఉంటుంది. ఇది కూడా వారికి ఎంతో మేలు చేస్తుంది. దాల్చిన చెక్కతో డికాషన్ తయారు చేసి తాగుతుండాలి. దాల్చిన చెక్కను లేదా పొడిని నీటిలో వేసి మరిగించి అనంతరం ఆ నీళ్లను వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. అవసరం అనుకుంటే అందులో కాస్త తేనె కలుపుకోవచ్చు. ఇలా ఈ మిశ్రమాన్ని తాగుతున్నా కూడా ఎంతగానో ఫలితం ఉంటుంది. అలాగే తల్లులు బాదంపప్పును కూడా రోజూ తినవచ్చు. ఇందులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వుల జాబితాకు చెందుతాయి. తల్లులకు ఎంతో మేలు చేస్తాయి. బాదంపప్పును రోజూ గుప్పెడు మోతాదులో తీసుకుని నీటిలో నానబెట్టి తింటుండాలి. లేదా బాదంపపప్పులను మెత్తగా చేసి మిక్సీ పట్టి పాలను తయారు చేసి ఆ పాలను కూడా తాగవచ్చు. దీని వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. ఇలా తల్లులు ఆయా చిట్కాలను పాటించడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. పసికందులకు కావల్సినన్ని పాలు లభిస్తాయి. దీంతో వారు ఆరోగ్యంగా ఉంటారు.



