సింగరేణి ఎన్నికల్లో టీబీజీకెఎస్‌ విజయం

హైదరాబాద్‌: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం విజయఢంకా మోగించింది. ఊహించినట్లు గానే సింగరేణికార్మిక సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంమే పై చేయిగా నిలిచింది. మొత్తం 11 ఏరియాల్లో ఎన్నికలు జరిగితే అందులో అయిదు ఏరియాలను తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సొంతం చేసుకుంది. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్‌ఎంఎస్‌ రెండేసి ఏరియాల్లో విజయం సాధించాయి.
భారీ ప్రచారాలు, హమీలు, వాగ్ధానాల సమ్మిళితంగా సాగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో అన్ని యూనియన్లు ఒక దానితో ఒకటి పోటీపడ్డాయి. నాలుగు జిల్లాల పరిధిలో సుమారు 63వేల మంది కార్మికులు పాల్గొన్నారు.ఖమ్మం జిల్లా ఇల్లెందు, ఆదిలాబాద్‌ జిల్లా బెల్లంపల్లిలో ఏఐటీయూసీ విజయం సాధించింది.
కొత్తగూడెం కార్పొరేట్లో ఐఎన్టీయూసీ విజయం దక్కించుకుంది.కొత్తగూడెం ఏరియాలో టీబీజీకెఎస్‌ మెజారిటీ సాధించింది. మందమర్రిలో ఏఐటీయూసీ మీద తెలంగాణా బొగ్గుగని కార్మిక సంఘం 712 ఓట్లను అధికారంగా సాధించి విజయాన్ని కైవసం చేసుకుంది. వరంగల్‌ జిల్లా భూపాల పల్లిలో కూడా తెలంగాణ బొగ్గుగని కార్మక సంఘం తన హవాను కొనసాగించింది.
ఎన్నికల నిర్వహణ కోసం వచ్చిన ఉపాధ్యాయులకు, సింగరేణి యజమాన్యానికి పారితోషికంగా విషయంలో తలెత్తిన చిన్న పాటి వివాదం కారణంగా గురువారం రాత్రి ఏడుగంటలకు కావాల్సిన కౌంటింగ్‌ ప్రక్రియ చాలా ఆలస్యంగా ప్రారంభమయింది. దీంతో రాత్రి 12 లోపల తేలిపోవాల్సిన ఫలితాలు బాగా ఆలస్యంగా అయ్యాయి. అర్థరాత్రి దాటిన తరువాత కూడా కొన్ని ప్రాంతాల్లో లెక్కింపు ప్రారంభం కాకపోవడం కార్మకుల్లో తీవ్ర అసహనానికి కారణమయింది. టీబీజీకెఎస్‌ విజయంతో కార్మికలు సంబరాల్లో మునిగితేలారు.