సునీతా విలియమ్స్ సేఫ్‌గా ల్యాండ్
తొమ్మిది నెలల అనంతరం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ మరో ఇద్దరు వ్యోమగాములు బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు సేఫ్‌గా ల్యాండ్ అయ్యారు. ఇక సునీతా విలియమ్స్, విల్‌మోర్‌లు సురక్షితంగా.. ఆరోగ్యంగా ఉన్నారని నాసా పేర్కొంది. ప్రశాంత వాతావరణం అనుకూలించడంతో డ్రాగన్ కాప్సూల్ అన్‌డాకింగ్, ల్యాండింగ్ ప్రక్రియ సజావుగా సాగిందని.. ఎటువంటి ఇబ్బంది తలెత్తలేదని వివరించింది. విజయవంతంగా భూమికి చేరడంతో.. హర్షాతిరేకాలు మిన్నంటాయి. సోషల్ మీడియాలో వేల పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.
వ్యోమగాముల టీమ్‌కి నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ మిషన్ సక్సెస్ అయ్యిందంటూ.. అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా కూడా వ్యోమగాములకు శుభాకాంక్షలు చెప్పింది. మరోవైపు సునీతా విలియమ్స్ సహా.. ఇథర వ్యోమగాముల్ని కలిసేందుకు కుటుంబ సభ్యులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు నలుగురు వ్యోమగాముల్ని హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించి అక్కడ వైద్య పరీక్షలు చేసి.. వారికి భూమి వాతావరణం, గ్రావిటీని అలవాటు చేస్తారు. ఇందుకు కొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. అయితే సునీత 9 నెలలు అంతరిక్షంలో ఉన్న కారణంగా ఆమె కాలి పాదాలు చాలా మెత్త బడ్డాయట. నడవలేని పరిస్థితి. తిరిగి గట్టిగా కావడానికి కొన్ని రోజులు టైమ్ పడుతుందని అంటున్నారు.
ఇక సక్సెస్ ఫుల్ జర్నీ పూర్తి చేసినందుకు వ్యోమగాములకి చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు.పుడమికి తిరిగి స్వాగతం. నిజంగా ఇది ఒక చారిత్రక ఘట్టం. 8 రోజుల్లో తిరిగి రావాలని వెళ్లిన మీరు 286 రోజుల తర్వాత భూమికి చేరుకున్నారు. ఆశ్చర్యపోయే రీతిలో 4577 సార్లు భూమి చుట్టూ తిరిగారు. మీరు గొప్ప ధైర్యవంతులు. మీకు సాటి ఎవరు లేరు. మీ ప్రయాణం ఒక థ్రిల్లర్ అడ్వెంచర్ మూవీని తలపిస్తోంది. ఇది గొప్ప సాహసం. నిజమైన బ్లాక్ బస్టర్ అంటూ చిరు తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.