సెంటిమెంట్‌ ఆధారంగా రాష్ట్రాన్ని విభజించకూడదు : కావూరి

జంగారెడ్డిగూడెం : సెంటిమెంట్‌ ఆధారంగా రాష్ట్రాన్ని విభజిస్తే కొంతకాలం తర్వాత ప్రత్యేక దేశం కావాలని అడుగుతారని ఏలూరు పార్లమెంట్‌ సభ్యుడు కావూరి సాంబశివరావు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆయన  మీడియాతో మాట్లాడారు. దేశంలో రాష్ట్రాల విభజన సెంటిమెంట్‌ ఆధారంగా కాకుండా శాస్త్రీయంగా జరగాలన్నారు. 80 శాతం పామాయిల్‌ ఉత్పత్తి రాష్ట్రం నుంచే జరుగుతుందని పామాయిల్‌ పంటకు గిట్టుబాటు ధర నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. వెంటనే పోలవరానికి జాతీయ హోదా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కొవ్వూరు-భద్రాచలం రైలు మార్గుం కోసం కేంద్రం మంత్రి పవన్‌కుమార్‌ బన్సల్‌కు వినతి పత్రం అందించినట్లు తెలియజేశారు. డీసీసీ అధికార ప్రతినిధి గురునాథరావు తదితరులు ఆయన వెంట ఉన్నారు.