స్మార్ట్‌ గ్రామాల అభివృద్దికి ఇది శుభపరిణామం: చంద్రబాబు

శ్రీకాకుళం,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): జన్మభూమి స్ఫూర్తితో స్మార్ట్‌ గ్రామం, స్మార్ట్‌ వార్డును అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి ఒక్కరూ అభివృధ్దిలో భాగస్వామ్యం కావాలన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ స్మార్ట్‌ గ్రామం, స్మార్ట్‌ వార్డులో భాగంగా పలు గ్రామాలను అభివృద్ది చేసేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారని … ఇది శుభపరిణామన్నారు. ఇది మిగతావారికి స్ఫూర్తిగా నిలవాలన్నారు. నాగరిక సమాజంలో ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి కట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరి వద్ద సెల్‌ఫోన్‌ ఉంటోందని.. మరుగుదొడ్డి మాత్రం నిర్మించుకోవడం లేదని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ అంశంపై ఆలోచించాలన్నారు. మహిళలకు తాము ముందు నుంచి ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. డ్వాక్రా సంఘాలను అభివృద్ధి చేయడం ద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేస్తామని చంద్రబాబు చెప్పారు. డ్వాక్రా సంఘాలను అన్ని విధాల ఆదుకుంటామని చెప్పారు. వాటి ఆదాయం పేంచే మార్గం గురించి ఆలోచిస్తున్నామన్నారు. డ్వాక్రా సంఘాలతో పేదరికాన్ని నిర్మూలించేందుకు కృషి చేస్తానని సి.ఎం. ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకారులకు ప్రత్యేక పథకాలను రూపొందించేందుకు ఆలోచిస్తున్నట్లు తెలిపారు. వారికి గృహాలను నిర్మించినున్నట్లు వెల్లడించారు. ఇక దేశంలో ఎక్కడికి వెళ్లినా శ్రీకాకుళం కనిపిస్తుందని, జిల్లా నుంచి వలసలు ఎక్కువగా ఉన్నాయని అంటూ వలసలను నివారించేందుకు చర్యలు తీసుకుంటామని  చంద్రబాబునాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆయన ప్రకటించారు.