హస్తినలో మెట్రో రైలెక్కిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ,జూలై 8 (జనంసాక్షి):
రాష్ట్రపతి ప్రతిభ పాటిల్‌ మెట్రో రైల్‌లో విహరించారు. ఆదివారం ఉదయం ఆమె ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. అనంతరం ఉద్యోగ్‌ భవన్‌ నుంచి సుల్తాన్‌పురి వరకు ప్రతిభ పాటిల్‌ మెట్రోరైలులో ప్రయా ణించారు. ఆమె సందర్శన, ప్రయాణానికి పోలీసులు గట్టి భద్రత కల్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందుతున్నదని చెప్పడానికి మెట్రో రైలు నిదర్శనమన్నారు. ఇలాంటి మెట్రో రైళ్లు దేశంలోని మిగతా మహానగరాల్లో రావాలని ఆమె ఆకాక్షించారు. ఇందుకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. మెట్రో రైళ్లతో ట్రాఫిక్‌ నియంత్రణలో ఉంటుందని ఆమె తెలిపారు. భారతీయ రైల్వే ప్రగతికి మెట్రో రైలు చిహ్నమని రాష్ట్రపతి వివరించారు. రైల్వే సిబ్బంది చిత్తశుద్ధితో పని చేస్తూ, ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలని కోరారు. రైల్వే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తున్నదని తెలిపారు.