హాకీ స్టిక్‌ తయారీలో కండోమ్‌

లాభాలకు లాభం..మన్నికకు మన్నిక
జలంధర్‌, జూలై 18: ఒక ఐడియా జీవితాన్నే మారుస్తుంది. పంజాబ్‌లోని ఒక వ్యాపారికి ఈ ట్యాగ్‌లైన్‌ సరిగ్గా సరిపోతుంది. హాకీ స్టిక్స్‌ తయారీదారుడైన ఆ వ్యక్తికి వచ్చిన ఐడియా అతని జీవితాన్నే మార్చేసింది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచింది. భారీ లాభాలను తెచ్చిపెట్టింది. దేశంలోనే నెంబర్‌వన్‌ హాకీస్టిక్స్‌ మేకర్‌గా నిలబెట్టింది. ఇంతకీ అతనికి వచ్చిన ఐడియా ఏంటో అనుకుంటున్నారా? కండోమ్‌ను హాకీస్టిక్‌ తయారీకి ఉపయోగించడం. సాధారణంగా జనాభా నియంత్రణకు, ఎయిడ్స్‌లాంటి మహమ్మారి రాకుండా కండోమ్‌ను ఉపయోగిస్తారు. కానీ పంజాబ్‌లోని హాకీ స్టిక్‌ వ్యాపారి సంజయ్‌ కోహ్లిని అడిగితే మాత్రం మరో ఉపయాగం చెబుతాడు. హాకీ స్టిక్‌ తయారీని సులభం చేస్తుందంటాడు. హాకీ స్టిక్‌ తయారు చేయడంలో ఒకప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్న సంజయ్‌ కోహ్లి గత కొంతకాలంగా బిజీబిజీగా ఉంటున్నాడు. విషయమేమింటే కండోమ్‌ అతనికి చాలా ఉపయోగపడింది. హాకీ స్టిక్‌ తయారీలో క్లిష్టమైన ప్రక్రియ హుక్‌ రూపొందించడం. స్టిక్‌ చివర జంపుగా ఉండే ఈభాగం చేసేందుకు చాలా సేపు శ్రమించాల్సింటుంది. ఏడు వేర్వేరు చెక్కలతో రూపొందించిన హుక్‌కు నెట్‌ను పొందికగా అమర్చాలి. చిన్న పొరపాటు జరిగిన అది వృథాయిపోతుంది. గత కొంతకాలంగా ఈ కారణాలతోనే నష్టాలననఱు చవిచూసిన సంజయ్‌ చివరకి ఉపాయం ఆలోచించాడు. హుక్‌ తయారీలో ప్లాస్టిక్‌ నెట్‌కు బదులు కండోమ్‌ వినియోగించి ఫలితాలు రాబట్టాడు. ఈ ఐడియాతో హాకీ స్టిక్‌ తయారీ సులభమవడంతో పాటు ఉత్పత్తి పెరిగిందని చెప్పాడు. సగటున రోజూ 225 స్టిక్స్‌ రూపొందిస్తూ, వేస్టేజ్‌ తగ్గడంతో లాభాలను ఆర్జిస్తున్నట్టు వివరించాడు. దీనికి తోడు కండోమ్‌ వినియోగంతో హాకీ స్టిక్‌ మరింత పటిష్టంగా తయారవడం కూడా అతనికి కలిసొచ్చింది. అటు దీనిని వాడుతోన్న ప్లేయర్లు కూడా మంచి ఫలితాలు సాధించారు. దీంతో కండోమ్‌ మేడ్‌ హాకీ స్టిక్స్‌కు బాగా డిమాండ్‌ పెరిగింది. మొత్తానికి చిన్న ఐడియా సంజయ్‌ కోహ్లి జీవితాన్నే మార్చేసింది.