హైదరాబాద్ పై దుష్ప్రచారం ఆపండి

share on facebook

వానలతో ఆగం కాదు.. ఏడ్పులతో అభివృద్ధి ఆగదు…

* నగరంలో 1908 తర్వాత భారీ వర్షాలు, ఉప్పొంగిన మూసి
* ఘట్ కేసర్ లో 32.3 సెం.మీ. నమోదైన గరిష్ట వర్షపాతం, చాలాప్రాంతాల్లో 25 సెం.మీ. పైన నమోదు
* సాధారణ వర్షపాతం కంటే 404 శాతం అధికం
* వరదలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా
* చెరువులు, నాలాలు కబ్జా అయిన ప్రాంతాల్లో ఎక్కువ వరద
* పాతబస్తీలో ఆగని నీరు, నిజాం డిజైన్ చేసిన నగర ప్రణాళికే కారణం
* మూసి నది వెడల్పు తగ్గి పెరిగిన వరద ఉదృతి
* వర్షం తగ్గిన కొద్ది గంటల్లోనే చాలాప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు

హైదరాబాద్ నగరంలో నూటాపన్నెండేళ్ల తర్వాత కురిసిన భారీవర్షం నగరంలోని రోడ్లన్నింటినీ వరదతో ముంచెత్తింది.  చాలా కాలనీల మీద వరద ముంపు ప్రభావం పడింది. కొన్ని గంటలపాటు సాధారణ జనజీవితం స్తంభించింది. ఎవరి అంచనాలకు అందకుండా అక్టోబర్ నెల ప్రథమార్థంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం కన్నా 404 శాతం అధిక వర్షపాతం నమోదైంది. సాధారణంగా పది సెంటీ మీటర్ల వర్షం పడినప్పుడు కూడా కొద్దిసేపు రోడ్ల మీద నీరు నిలవడం సహజం, అలాంటిది ఒకేరోజు నగరవ్యాప్తంగా వివిధప్రాంతాల్లో పది నుండి ముప్పైరెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో వరద పరిస్థితి ఏ విదంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. వరద పరిస్థితి గురించి ఏకంగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆరా తీయడం వరద తీవ్రతకు అద్దం పడుతుంది. గత రెండు, మూడు దశాబ్దాలలో ఎన్నో చెరువులతో పాటు మూసి నది తీరం ఆక్రమణలకు గురైన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో వచ్చిన వరద ఎటుపోతుంది. అపార్టుమెంట్ల సెల్లార్లను ముంచెత్తింది, చెరువుల్లో వెలిసిన ఇండ్లలోకి వెళ్ళింది. పాతబస్తీ పరిసరాల్లోని వరద కారణంగా కొన్ని కాలనీలతో పాటు అరాం ఘర్, చాంద్రాయణగుట్ట, టోలిచౌకి, చాదర్ఘాట్ ప్రాంతంలో వరద ఉదృతి కనిపించింది. అయినప్పటికీ వర్షం తగ్గిన కొద్ది గంటల్లోనే నిలిచిన నీరు లేకుండా పోయింది. కానీ ఒక వైపు వర్షం కురుస్తుండగానే నగరంలో సాధారణ పరిస్థితులు ఏర్పడటానికి రేయింబవళ్లు కృషి చేస్తున్న మున్సిపల్, విద్యుత్, పోలీస్ సిబ్బంది సేవలను గుర్తించకుండా కొన్ని మీడియా సంస్థలు హైదరాబాద్ నగరంపై ద్వేషపూరితంగా దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. నగరం మునిగింది, మెట్రో కుంగింది అంటూ ప్రజల్లో భయాందోళనలు కలిగేలా కథనాలను ప్రచారం చేశాయి.  ఇప్పైటికైనా వరదల వలన ఉత్పన్నమైన పరిస్థితులను వివరించడం మాత్రమే కాకుండా వరదలకు కారణమైన చెరువులతో పాటు మూసి తీరం కబ్జాల గురించి మరియు వాటికి కారకులు ఎవరనేది చర్చిస్తే బాగుంటుంది. ఎవరెంత మొత్తుకున్నా హైదరాబాద్ వానలతో ఆగం కాదు.. ఏడ్పులతో అభివృద్ధి ఆగదు!

Other News

Comments are closed.