అంతరాష్ట్ర ఇసుక రవాణ ఇక నిషేదం

ఇందిరమ్మ ఇళ్లకు మాత్రమే ఉచితం
అక్రమాలకు పాల్పడితే వాహనాలు సీజ్‌
కొత్త ఇసుక పాలసీని ప్రకటించిన మంత్రి గల్ల అరుణ
హౖదరాబాద్‌, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి): క్యూబిక్‌ మీటరు ఇసుక విలువ 325 రూపాయలుగా నిర్ణయించినట్టు మంత్రి గల్లా అరుణకుమారి ప్రకటించారు. ఇసుక కొత్త పాలసీ వివరాలను వెల్లడించారు. ఆదివారంనాడు సచివాలయంలో ఆమె మాట్లాడుతూ అంతర్‌రాష్ట్ర ఇసుక రవా ణాపై నిషేధం విధించామని చెప్పారు. అంతేగాక ఇసుక అమ్మకాల ద్వారా వచ్చిన 100 శాతం రాయల్టీని జడ్పీ ఖాతాకు జమ చేస్తామని తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రొక్లెయిన్ల వినియోగాన్ని నిషేధిస్తున్నామని అన్నారు. అలాగే బలహీ నవర్గాల కోసం నిర్మితమయ్యే ఇందిరమ్మ ఇళ్లకు మాత్రం ఇసుక ఉచితంగా అంద జేయనున్నట్టు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లకు తరలించే ఇసుకను తప్పనిసరిగా ఎడ్ల బండ్లపై, ట్రాక్టర్లపై మాత్రమే తరలించాలని చెప్పారు. ఏ క్వారీ నుంచైనా ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుకను అందజేయనున్నట్టు తెలిపారు. అలాగే గిరిజన ప్రాంతాల్లోని ఇసుక రీచ్‌లను స్థానిక సొసైటీలకు అందజేస్తామన్నారు. లాటరీ పద్ధతిన ఇసుక రీచ్‌లు కేటాయిస్తామన్నారు. అమ్మకం ధరను జిల్లా అథారిటీ నిర్ణయిస్తుందని తెలిపారు. ఇప్పటికే క్వారీలు దక్కించుకున్న వారు నూతన పాలసీ ప్రకారం అమ్మకాలు జరపాలని కోరారు. రాతి ఇసుక వాడకాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పట్టా భూముల్లో ఇసుక తవ్వేందుకు రైతులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్టు చెప్పారు. గ్రామాల్లోని చెరువులు, వాగులు, చిన్న చిన్న నది పాయలు వద్ద లభించే ఇసుకను ఉచితంగా ఆ గ్రామాల్లోని ప్రజలే వాడుకోవచ్చని కోరారు. ఇసుక అమ్మకం, తవ్వకం విషయాల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఇసుకను స్వాధీనం చేసుకుంటామని, అలాగే ఇసుక రవాణా చేసే వాహనాలను జప్తు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటివరకు ఇసుక అక్రమార్కులపై 3500 కేసులు నమోదు చేసినట్టు చెప్పారు.