అంతరిక్ష పరిశోధనలో మరో ముందడుగు
– అంగారక గ్రహాన్ని చేరిన ‘క్యూరియాసిటీ’
– నాసా ప్రయోగం విజయవంతం
– ఆనందోత్సవాల్లో శాస్త్రవేత్తలు
కాలిఫోర్నియా,ఆగస్టు 6 : నాసా శాస్త్రవేత్తలు ప్రయోగించిన క్యూరియాసిటీ రోవర్ సోమవారం భారత కాలమానం ప్రకారం పదిన్నర గంటలకు అంగారక గ్రహంపై విజయవంతంగా కాలిడింది. అంగారక గ్రహం నుంచి రోవర్ తీసిన తొలి చిత్రం నాసా కేంద్రానికి అందడంతో శాస్త్రవేత్తలంతా ఎంతో సంబరపడ్డారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని తమ సంతోషాన్ని పంచుకున్నారు. అంగారక గ్రహంపై జీవం ఉనికి ఉందా? లేదా? అనే అంశంపై పరిశోధనలు జరిపేందుకు నాసా క్యూరియాసిటీ రోవర్‌ను ప్రయోగించింది. ఆ గ్రహంపై జీవం ఆనవాళ్లను పసిగట్టేందుకు నాసా చేసిన ప్రయోగం విజయవంతమవడంతో నాసా వర్గాల్లో ఆనందోత్సాలు వెల్లివిరిశాయి. ఈ ప్రయోగం పట్ల ప్రపంచ దేశాలన్నీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశాయి. నాసా ప్రయోగించిన వ్యోమనౌకలలో ఈ తరహాకు చెందిన ప్రయోగం ఇదే మొదటిది. సోమవారం అంగారక గ్రహంపై ఉన్న గేల్ బిలంలో రోవర్ విజయవంతంగా దిగింది. గంటకు సుమారు 21వేల కిలోమీటర్ల వేగంతో అరుణ గ్రహం దిశగా ఈ వ్యోమ నౌక దూసుకుపోయింది. సుమారు ఎనిమిదిన్నర నెలల పాటు రోవర్ ప్రయాణించింది. గత ఏడాది నవంబర్ 26న భూమి నుంచి ఈ నౌక బయలుదేరింది. సుమారు రూ. 13,700 కోట్ల (200 బిలియన్ డాలర్లు) వ్యయంతో రోవర్‌ను నిర్మించారు. ఇది ఒక మొబైల్ ప్రయోగశాల. ఇతర గ్రహంపై దిగిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన అతి పెద్ద మానవ నిర్మిత వ్యోమ నౌక రోవర్. దీని బరువు సుమారు 900 కేజీలు. ఆరు చక్రాలతో న్యూక్లియర్ శక్తితో ఇది పనిచస్తుంది. సుమారు రెండేళ్లపాటు ఈ రోవర్ అంగారక గ్రహంపై పరిశోధనలు చేస్తుంది. అంగారక గ్రహంపై ఎక్కువ శాతం హైడ్రోజన్ ఉండడంతో నీరు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీంతో జీవం ఉనికిని కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ఈ అతి పెద్ద భారీ ప్రయోగం చేశారు. నాసా ప్రయోగించిన ఈ తరహా ప్రయోగాలలో ఇదే ఖరీదైన ప్రాజెక్టు.
శాస్త్రవేత్తల్లో ఆనందోత్సాహాలు
అంగారక గ్రహంపై విజయవంతంగా క్యూరియాసిటీ రోవర్ దిగిన వెంటనే శాస్త్రవేత్తల్లో ఆనందోత్సాహాలు వెల్లివెరిశాయి. ‘దీనిని నమ్మలేకపోతున్నాను. నిజంగా నమ్మశక్యం కాని విషయమని’ మిషన్ కంట్రోలర్స్ టీం డిప్యూటీ లీడర్ అలెన్‌కెన్ వ్యాఖ్యానించారు. రోవర్ విజయవంతం కావడంతో అమెరికా ప్రధాని బరాక్ ఒబామాకు శాస్త్ర సాంకేతిక సలహాదారు జాన్‌హోల్డ్రెన్ నాసా కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి శాస్త్రవేత్తలను అభినందించారు. అంతరిక్ష పరిశోధనల్లో క్యూరియాసిటీ రోవర్ సాధించిన విజయం ఓ గొప్ప ముందడుగని ఆయన అన్నారు. రోవర్ ప్రయోగం విజయవంతం కావడంతో ఈతరహా ప్రయోగాలు చేసేందుకు భారత ప్రభుత్వం ఇస్రోకు కూడా అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
క్యూరియాసిటీ ముఖ్య ఉద్దేశం..
ఈ విశ్వంలోని ప్రాణులం మనమొక్కరమేనా? ఇతర గ్రహాల్లో మనలాంటి జీవరాశులేమైనా ఉన్నాయా? వీటన్నింటినీ పరిశోధించడానికి నాసా ప్రయోగించిందే క్యూరియాసిటీ రోవర్. ఒక టన్ను బరువు కలిగి.. చిన్న కారు సైజున్న క్యూరియాసిటీ.. కొండలను పిండి చేసే సత్తా కలిగి ఉంది. గతంలో అంగారకునిపై నీటి ఛాయలు కనిపించిన నేపథ్యంలో .. ప్రాణుల మనుగడకు అవసరమైన పరిస్థితుల కోసం క్యూరియాసిటీ ఆ గ్రహంపై అన్వేషిస్తుంది. క్యూరియాసిటీ రోవర్ గంటకు 21,240 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది ధ్వని వేగానికి ఏడు రెట్లు ఎక్కువ. సూపర్ సానిక్ ప్యారాచూట్ సాయంతో వేగాన్ని నియంత్రించుకుంటుంది. క్యూరియాసిటీ ల్యాండింగ్ వివరాలను దానిపై ఉండే రెండు నాసా ఆర్బిటర్లు, యూరోపియన్‌స్పేస్ ఏజెన్సీకి చెందినమరో ఆర్బిటర్ ఎప్పటికప్పుడు భూమ్మీదకు పంపుతుంటాయి. ల్యాండింగ్‌కు సంబంధించిన వివరాలను నాసా ఇప్పటికే ‘సెవెన్ మినిట్స్ ఆఫ్ టెర్రర్’ అన్న పేరిట ఇంటర్నెట్‌లో పెట్టింది. దీనికి అమర్చిన ప్రధాన కంప్యూటర్ విఫలమైతే స్టాండ్‌బైగా ఉన్న బ్యాకప్ కంప్యూటర్ పని చేసేలా నాసా మిషన్ కంట్రోల్ సైంటిస్టులు ఏర్పాట్లు చేశారు.